VRA Representatives on Meeting With KTR: వీఆర్ఏల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం ముగిసింది. 15 మందితో కూడిన వీఆర్‌ఏల బృందాన్ని అసెంబ్లీకి ఆహ్వానించిన మంత్రి.. అసెంబ్లీ కమిటీ హాల్‌లో వారితో భేటీ అయ్యారు. వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. పే స్కేల్, పదోన్నతులు ఇవ్వాలని, వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ను వీఆర్ఏ ప్రతినిధులు కోరారు. సమావేశ అనంతరం వీఆర్‌ఏల ప్రతినిధులు మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీద తమకు నమ్మకముందని వీఆర్‌ఏల ప్రతినిధులు పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. 20వ తేదీన ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని చెప్పారని.. అప్పటి వరకు శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తమకు ఎలాంటి రాజకీయ మద్దతు లేదన్న ప్రతినిధులు.. జేఎసీ తరఫున తమ సమస్యలపై కేటీఆర్ చర్చించారన్నారు.
అప్పటి వరకు శాంతియుతంగా నిరసన..: గతంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని ప్రతినిధులు పేర్కొన్నారు. 50 ఏళ్లు పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్నారని.. అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు ఇస్తామని హామీ ఇచ్చారని వివరించారు. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్ కోరారని.. అయితే ఈ నెల 20 వరకు తాము శాంతియుతంగా నిరసనను కొనసాగిస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్ మీద మాకు నమ్మకముంది. వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు. 20వ తేదీన ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సమ్మె తాత్కాలికంగా వాయిదా వేయాలని కేటీఆర్ కోరారు. రేపటి నుంచి చర్చల వరకు శాంతియుతంగా నిరసన కొనసాగిస్తాం.- వీఆర్‌ఏల ప్రతినిధులు
ఉద్రిక్తతకు దారితీసిన అసెంబ్లీ ముట్టడి..: అంతకుముందు వీఆర్‌ఏల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. భారీ ర్యాలీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వీఆర్‌ఏలను తెలుగు తల్లి వంతెన కింద పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. తెలుగు తల్లి వంతెనపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పే స్కేలు వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వీఆర్‌ఏలు తరలిరావడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కేటీఆర్ వీఆర్‌ఏ ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై చర్చించారు.
ఇవీ చూడండి..