Vote from Home for Senior Citizens Telangana : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటిన వారు.. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ సదుపాయాన్ని కోరుకున్న వారికి.. ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని.. త్వరలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది. 80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
Vote from Home in Telangana Elections 2023 : నామినేషన్ల ప్రక్రియ పూర్తై.. అభ్యర్థులు ఖరారైన మీదట పోస్టల్ బ్యాలెట్లు(Postal Ballots) సిద్ధం చేస్తారు. ఇంటి నుంచి ఓటు వేసే వారికి సంబంధించి ప్రత్యేక రంగులో బ్యాలెట్ పత్రం రూపొందించనున్నారు. ఆ సదుపాయం కావాలనుకునే వారు లిఖిత పూర్వకంగా ఆ ప్రాంత ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకుంటే.. ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. నాగార్జునసాగర్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) ఆ విధానం అమలు చేశారు. ఆ ప్రయత్నం ప్రయోజనకరంగా ఉండటంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
Telangana Assembly Elections 2023 : 'ఆ కేంద్రాల్లో సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయండి'
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఈ సంవత్సరం చివరి లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎవరు అర్హులన్న విషయమై.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్రానికి సమాచారం పంపింది. 80 ఏళ్లు దాటిన వారు, కేంద్ర బలగాల్లో పని చేస్తున్న వారు, పోలింగ్ ఏజెంట్లు, దివ్యాంగులు, ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది.. ఇలా 11 రకాల వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేయాలని సీఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఎన్నికల షెడ్యూల్ తర్వాత విధివిధానాలు.. : ఇదిలా ఉండగా.. ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు విధి విధానాలను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) సంబంధిత అధికారులకు పంపనుంది. ఈ మేరకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4,87,950 మంది ఉన్నారు. వచ్చే నెలలో విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో ఇలాంటి ఓటర్లు ఎంత మంది ఉంటారన్నది తేలాల్సి ఉంది.
Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా