ముందస్తు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం 2018 డిసెంబర్ 13న రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో మారు బాధ్యతలు స్వీకరించారు. మరో రెండు రోజుల్లో తెరాస రెండో ప్రభుత్వం ఏడాది కాలాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం ఇవాళ జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నీటిపారుదల అంశాలే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
'పన్నుల వాటాల్లో గణనీయంగా తగ్గిన రాష్ట్ర వాటా'
దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. మూడు వేల కోట్ల వరకు తగ్గుదల ఉండే అవకాశం కనిపిస్తోంది. ఐజీఎస్టీలో రాష్ట్ర వాటా రూ.2 వేల 812 కోట్లు కూడా విడుదల చేయలేదు. దీనికి తోడు జీఎస్టీ పరిహారం 1719 కోట్ల రూపాయలు కూడా రాష్ట్రానికి అందలేదు. ఈ ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా పడింది. బడ్జెట్ లో పేర్కొన్న విధంగా పన్నుల వాటా విడుదల చేయాలని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. త్వరలోనే ప్రధాని మోదీని కూడా కలిసే ఆలోచనలో సీఎం ఉన్నారని సమాచారం.
అన్ని శాఖల ఖర్చులను నియంత్రించాలి...
ఆదాయం తగ్గిన నేపథ్యంలో అన్ని శాఖల ఖర్చుల్లోనూ కోత విధించాలని, ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణ పాటించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రస్తుత స్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర నివేదికను మంత్రి వర్గ సమావేశంలో ఇవ్వాలని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. నీటిపారుదల అంశాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు సైతం తీసుకునే అవకాశం ఉంది.
నీటిపారుదల విధానం... పుర ఎన్నికలు... దిశ ఉదంతంపై చర్చ...
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మధ్యమానేరు జలాశయానికి ప్రస్తుతం రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అదనపు టీఎంసీ కోసం అవసరమైన పనులు చేపట్టాలని ఆదేశించారు. మల్లన్నసాగర్‌కు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని తెలిపారు. ఈ రెండు పనులకు కూడా నెలాఖరులోగా టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
దుమ్ముగూడెం ఆనకట్టకు, మూడో టీఎంసీ పనులకు మొత్తం 14వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మేరకు ఇవాళ జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కృష్ణాలో నీటి ప్రవాహం లేనప్పుడు గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు అందించే పనులపైనా కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర సమగ్ర నీటిపారుదల విధానం, ఇరిగేషన్ జోన్ల విషయమై కూడా భేటీలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు పురపాలక ఎన్నికల నిర్వహణ, శాసనసభ సమావేశాలు, దిశ ఉదంతం తదనంతర పరిణామాలు, తాజా రాష్ట్ర పరిస్థితులు సహా ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి : నాలుగో రోజు ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ...