CS Shantikumari Review with Collectors : కంటి వెలుగు, ఆరోగ్య లక్ష్మి, పంట నష్టం సర్వే, ధాన్యం సేకరణ, 58, 59 ఉత్తర్వుల కింద క్రమబద్దీకరణ, ఆయిల్ పామ్ సాగు, టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహణ, ఎరువుల సరఫరా తదితర అంశాలపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. కంటి వెలుగు, ఆరోగ్య మహిళా శిబిరాలను కలెక్టర్లు తరచూ సందర్శించాలన్న శాంతికుమారి.. మరింత మెరుగ్గా సేవలు అందేలా చూడాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ పని చేయాలని, రైతులకు చెల్లింపులను వెంటనే చేయాలని స్పష్టం చేశారు. 58 ఉత్తర్వు కింద మిగిలిన క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని.. 59 ఉత్తర్వు కింద కన్వీనియెన్స్ డీడ్లను యుద్ధ ప్రాతిపదికన 15వ తేదీలోపు పూర్తి చేయాలని సీఎస్ కలెక్టర్లకు తెలిపారు.
ఆయిల్ పామ్ మొక్కలను 40 రోజుల్లో పంపిణీ ప్రారంభమవుతుందని, జిల్లా స్థాయిలో సమీక్షించాలని ఆదేశించారు. సరిపడా మొక్కలు ఉన్నందున ఈ ఏడాది లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు వినూత్న విధానాలను సూచించాలని కలెక్టర్లను శాంతికుమారి కోరారు. డీఏపీ, యూరియా తదితర ఎరువులు అన్ని జిల్లాల్లో సరిపడా ఉండేలా చూడాలని, స్టాక్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం...: ఇదిలా ఉండగా.. తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం మొలకలు వస్తుంటే.. తేమ పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అన్నదాతలు ఆరోపిస్తున్నారు. పలు చోట్ల ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. తడిసిన ధాన్యాన్ని చూసి.. రైతుల గుండెచప్పుళ్లు ఆగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటామంటూ.. రైతుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నెలన్నర రోజుల కిందటే ప్రణాళికలు రూపొందించుకుని సిద్ధంగా ఉన్నా.. పంటను వెనువెంటనే కొనుగోలు ప్రక్రియ చేపట్టలేదు. కొందరు రైతులు తడిసిన ధాన్యాన్ని ఎండకు ఆరబెట్టి కుప్పలు పోయక ముందే అకాల వర్షం వల్ల ధాన్యం తడిసిపోయింది. కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులకు భరోసా ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో కొనుగోలు చేయట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: