సాగు చట్టాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొన్ని సవరణలకు ముందుకొచ్చిన కేంద్రం.. పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలపై విస్తృతంగా చర్చించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ అమీర్‌పేట్ మ్యారీగోల్డ్ హోటల్లో జరిగిన నాబార్డ్ రాష్ట్ర స్థాయి రుణ ప్రణాళిక-2021 సదస్సుకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి ఆయన హాజరయ్యారు.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు ఉపయోగపడే చట్టాలు చేయాలని వినోద్‌కుమార్ సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ మూడు వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేయాలని కోరారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని కేంద్రం తెచ్చిన ఈ చట్టాల్లో అనేక లోపాలున్నాయన్న ఆయన.. వాటన్నింటినీ సవరించాల్సిందేనన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి.. అభిప్రాయాలను సేకరించాలని కోరారు.
ఇదీ చూడండి: 'అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం'