రాష్ట్రంలో ఆరేళ్ల కాలంలోనే జల విప్లవాన్ని సాధించి, నీటి భద్రతకు స్థిరమైన పరిష్కారం చూపామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) 'నీటి సంరక్షణకు సుస్థిర పరిష్కారాలు' అనే అంశంపై నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల దృశ్యమాధ్యమ సమావేశంలో వినోద్ కుమార్ ప్రసంగించారు. నీరు, నిధులు, నియామకాలు అనే నినాదంతో స్వరాష్ట్ర సాధన కోసం సాగిన తెలంగాణ ఉద్యమంతో పాటుగా.. ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఆరేళ్ల కాలంలోనే నీటి పారుదల రంగంలో సాధించిన విప్లవాత్మక విజయాలపై వినోద్ కుమార్ నివేదికను సమర్పించారు.
సాగు నీరు ద్వారా వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వినోద్ కుమార్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికా బద్ధంగా కార్యాచరణను రూపొందించి పకడ్బందీగా అమలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం సుసంపన్నంగా, సస్యశ్యామలంగా మారిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. దీని కారణంగానే ఆరేళ్ల కాలంలోనే పలు రంగాల్లో.. ముఖ్యంగా నీటి పారుదల విభాగంలో యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచిందని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: 'అధిక ఆదాయం వచ్చే పంటలను పండిద్దాం'