Vinayaka Festivals in Telangana State: గణేశ్ నవరాత్రి ఉత్సవాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విభిన్న ఆకృతులతో కొలువుతీరిన గణనాథులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడలో ఏర్పాటు చేసిన లంబోదరుణ్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన మండపం వద్ద చిన్నారులతో కలిసి ఫోటోలు దిగుతూ సందడిగా గడిపారు. బన్సీలాల్‌పేట్‌లో బాబురావు బస్తీవాసులు ఏర్పాటు చేసిన గణనాథున్ని నిమజ్జనం చేశారు.
పూల అలంకరణతో ముస్తాబు చేసిన వాహనంపై గణపతిని ఊరేగించారు. హైదరాబాద్ గీతానగర్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చిన్నారులు గణేశుడి వద్ద పుస్తకాలు పెన్నులు పెట్టి హారతులు అందించారు. ఉస్మాన్‌గంజ్‌లో వినాయక మండపం వద్ద భక్తులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తూ సరాదాగా గడిపారు.
400 విగ్రహాలు ఒకే చోట ఏర్పాటు: పర్వేదలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యువసేన యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. గుర్రం బగ్గిలు బ్యాండ్ వాయిద్యాల మధ్య యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో లంబోదరుడి నిమజ్జనోత్సవం శోభాయమానంగా సాగింది. సుమారు 400 విగ్రహాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు... ఐదు రోజులపాటు పూజలు చేశారు. విగ్రహాలను వివిధ వాహనాలపై ఏర్పాటు చేసి ఊరేగించారు.
సర్వనదులను విగ్రహ రూపంలో అలంకరణ చేసి:పాటలు యువకుల కేరింతల నడుమ.. నిర్మల్ జిల్లా బోరిగాంలో వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. నూతన వస్త్రాలు, తలకు పాగ చుట్టి మహిళల మంగళహారతులతో వినాయకున్ని పల్లకిలో ఉరేగించారు . భద్రాచలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సర్వనదులను విగ్రహ రూపంలో అలంకరణ చేసి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. 12 రకాల పండ్లు, 12 రకాల పూలతో గణపతికి పూజ చేశారు.
కుత్రిమ కొలనులు ఏర్పాటు: హైదరాబాద్‌లో నిమజ్జనాలు కొనసాగుతుండగా..... సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. GHMC ఏర్పాటుచేసిన తాత్కాలిక కొలనులోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు.
ఇవీ చదవండి: