రాజకీయ, సినీ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా... కందుల రమేశ్ రచించిన 'మేవరిక్ మెస్సయ్య' పుస్తకాన్ని... హైదరాబాద్‌లో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోప్రముఖ పాత్రికేయులు సంజయ్‌బారు, మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు, పూర్వ జేడీ. లక్ష్మీనారాయణ, ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
"ఎన్టీఆర్ జీవిత విశిష్టత ప్రపంచానికి తెలియాల్సిన అవసరముంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న వెంకయ్య నాయుడు.. ఆయన అధికారంలో ఉన్న అతిపెద్ద పార్టీకి ఎదురు నిలబడి ఓడించగలిగిన ఓ నటుడు మాత్రమే కాదు. రాజకీయ సంస్కృతినే మార్చిన నేత. ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. తెలుగు భాషకు గుర్తింపు తీసుకువచ్చిన నేత. ఎన్టీఆర్ కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న నేతలు ఉండవచ్చు. కానీ ఎన్టీఆర్ ప్రాంతీయ, జాతీయ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. తన చిన్న రాజకీయ జీవితంలో..జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ పాత్రకు అంత గుర్తింపు దక్కలేదు. 'మేవరిక్ మెస్సయ్య' పుస్తకం ద్వారా ఆ వెలితి కొంచెం తీరుతుందని భావిస్తున్నా."
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
"ఎన్టీఆర్ రాష్ట్రాలకు అధికారం ఉండాలని బలంగా నమ్మారు. ప్రస్తుతం రాష్ట్రాల అధికారాలు ప్రశ్నార్థకంగా మారాయి. రాష్ట్రాల ఆర్థిక అధికారాలు పరిమితం అవుతున్నాయి. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి సంబంధించిన అధికారాలు కోల్పోతున్నాయి. దేశంలో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలతో ముడిపడి ఉంటారు. అయినా రాష్ట్రాల అధికారాలు తగ్గిస్తూ..దేశ ఐక్యతను దెబ్బతీసేలా కేంద్రాన్ని బలోపేతం చేస్తున్నారు. ఎన్టీఆర్ రాష్ట్రాలకు అధికారం, దేశ ఐక్యత అంశాలను బలంగా నమ్మారు."
- సంజయ్ బారు, ప్రముఖ పాత్రికేయుడు
"ఈ పుస్తకంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితం, విద్య, వైద్యం, వ్యవసాయానికి ఆయన చేసిన సేవలు సహా అనేక అంశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగుబాట్లు నిష్పాక్షికంగా వివరించాను. ఈ పుస్తకం ఆ నాటి స్మృతులను గుర్తు చేస్తుంది. "
- ప్రముఖ పాత్రికేయుడు, పుస్తక రచయిత కందుల రమేశ్
ఇదీ చూడండి : ఇండియా సైకిల్ ఫర్ ఛేంజ్ ఛాలెంజ్‌లో రాష్ట్రం నుంచి 2 నగరాలు