Venkaiah Naidu: వ్యవసాయంలో దిగుబడితో పాటు పర్యావరణహితం కీలకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మన బంగారు భవిష్యత్తు కోసం ప్రకృతిని పరిరక్షించుకుందామని తెలిపారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన 'ప్రకృతి సైన్యం' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతునేస్తం పబ్లికేషన్ ఆధ్వర్యంలో 100 మంది ప్రకృతి రైతుల స్ఫూర్తి కథనాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
బ్రిటిష్ పాలకులు వ్యవసాయాన్ని దెబ్బతీశారని.. ప్రకృతి రైతుల విజయగాథలు పుస్తక రూపంలో రావడం సంతోషమని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రతి గాథ రైతులు, యువతకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. గాలి, నీరు, పచ్చదనం నిర్లక్ష్యం చేస్తూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నామని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల దృష్ట్యా ఉచిత విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు. ఉచితంగా విద్యుత్ వస్తుందని ఇష్టారాజ్యంగా వాడుతున్నామని.. విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే డబ్బు వెచ్చించాల్సిందేనని వెల్లడించారు.
ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి..: అన్నదాతలు క్రమంగా ప్రకృతి సేద్యం వైపు మళ్లాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు గ్రామాల్లోకి వెళ్లి, రైతులతో మమేకం కావాలని తెలిపారు. ప్రతి శాస్త్రవేత్త భారతీయ భాషలు నేర్చుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. పశు సంపద ప్రతి ఒక్కరూ దేశ సంపదగా భావించాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: "మీ ఓట్లు నాకు అవసరం లేదు".. గ్రామస్థులపై ఉత్తమ్ అసహనం..!