దేశవ్యాప్తంగా కార్పోరేట్ సంస్థలకు మేలు చేసి, రైతుల పొట్టగొట్టే వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్.హనుమంతరావు డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ... విపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ భారత్ బంద్ పిలుపుతో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. హైదరాబాద్ బషీర్‌బాగ్ ఆదాయ పన్ను కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద వీహెచ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కేంద్రం ఈ బిల్లులను ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో తాము గ్రామాల్లోని రైతులను చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వీహెచ్ హెచ్చరించారు. దేశంలో ఆరుగాలం తీవ్రంగా శ్రమించి పండించిన వ్యవసాయోత్పత్తులు ఎక్కడైనా అమ్ముకోవచ్చంటే... ప్రభుత్వ సేకరణ, గిట్టుబాటు ధరలు, పర్యవేక్షణ లేకుండా కార్పోరేట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి అన్నదాత ఎలా తన మనుగడ సాగించగలుగుతారని ప్రశ్నించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ ఈ బిల్లులకు వ్యతిరేకంగా మద్దతు తెలిపిన దృష్ట్యా... తామంతా రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వీహెచ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి: వీహెచ్