బడుగు, బలహీన వర్గాల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఒక కులం వాళ్లను కించపరిచేట్లు మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు విమర్శించారు. 2018లో గొర్లు, పొట్టెళ్లు ఇస్తామని గొర్రెల సొసైటీ సభ్యుల నుంచి 30వేల మేర వసూలు చేసి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు.
2018లో ఒక్కో సభ్యుడి నుంచి రూ.31,250 లెక్కన 7.62లక్షల మంది నుంచి ప్రభుత్వం వసూలు చేసిందన్నారు. అందులో 3.42లక్షలు మందికి మాత్రమే గొర్లు ఇచ్చారని, మిగిలిన 4 లక్షల 20 వేల మంది సభ్యులకు ఇవ్వలేదని, వారు ఆందోళన చేస్తే ఆ కులాన్ని కించపరిచేట్లు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
30నెలలపాటు ఓపిక పట్టిన తరువాత బాధితులు ఆందోళన చేయడంలో తప్పేముందని నిలదీశారు. విషయం తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించేందుకు ఉన్న అవకాశాలు చూడాలే తప్ప... ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేసీఆర్ ఒక కులాన్ని కించపరిచేట్లు మాట్లాడడంలో అర్థం లేదని ఆయన విమర్శించారు.