పట్టభద్రులమైన తాము ఉద్యోగాలు లేక రోడ్డునపడ్డామని... కుటుంబాలను పోషించలేని స్థితిలో ఉన్న తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ పశు సంవర్ధక పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు అర్హులమైన తమను కాదని... అటెండర్లతో ఆ పోస్టులను భర్తీ చేస్తూ తమ జీవితాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు సమరసింహరెడ్డి కమిషన్కు వివరించారు. టెక్నికల్ పోస్టులను అటెండర్లతో భర్తీ చేస్తున్నారని... పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ స్వలాభం కోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జీవో నెంబర్ 26ను అక్రమంగా తీసుకొచ్చి... 50 శాతం ఉద్యోగాలను అటెండర్లకు కట్టబెడుతున్నారని తెలిపారు. పోస్టులను అమ్ముకొనేందుకే డైరెక్టర్ ఈ జీవోను తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని... తీర్పు రాకముందే పోస్టులను అటెండర్లతో భర్తీ చేసేందుకు డైరెక్టర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ నెల 18న అటెండర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. డైరెక్టర్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని... న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చేంత వరకు ఎటువంటి భర్తీలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని వారు కమిషన్ను విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశు సంవర్ధక పాలిటెక్నిక్ విద్యార్థులందరికి సామూహిక ఆత్మహత్యలకు అనుమతి ఇవ్వాలని వారు హెచ్ఆర్సీని కోరారు.
ఇదీ చదవండి: అపోహలతో పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం: తలసాని