ఏపీలో సంచలనం రేపిన ఏలూరు ఘటనలో.. బాధితుల అస్వస్థతకు కూరగాయలు కలుషితం కావడమే కారణం కావొచ్చని ఉన్నతస్థాయి కమిటీ బలంగా అభిప్రాయపడింది. ఏలూరు మార్కెట్‌కు వచ్చిన కూరగాయలు.. అక్కడినుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లినందున బాధితులు వేర్వేరు చోట్ల కనిపించారని పేర్కొంది. మంచినీటిలో కొన్ని కలుషితాలున్నా.. అవి పరిమితుల్లోనే ఉన్నాయని... ఈ సమస్యకు అవి మూలం కాదని నిర్ధారణకు వచ్చింది. అయినా.. కొంతకాలం పాటు ఉభయగోదావరి జిల్లాల వ్యాప్తంగా నీటి నమూనాలను తరచు పరీక్ష చేయడం చాలా అవసరమని సిఫార్సు చేసింది. కార్లు, ఇతర వాహనాలు సర్వీసింగ్ చేసిన నీరు ఏలూరు కాలువలో కలవకుండా చూడాలని చెప్పింది. నిషేధించిన రసాయనాలు పొలాల్లోకి చేరకుండా వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని సూచించింది. తిరుపతి, గుంటూరు, విశాఖ జిల్లాల్లో రాష్ట్రస్థాయి ప్రయోగశాలలు ఏర్పాటుచేసి, ఆహారం, నీటి నమూనాల్లో ఆర్గానో ఫాస్ఫేట్లు, ఆర్గానో క్లోరైడ్లు ఉంటున్నాయేమో చూడాలని పేర్కొంది.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డిసెంబరు 4 నుంచి 12వ తేదీ మధ్య 622 మంది బాధితులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు. మూర్ఛతో కింద పడిపోవడం, నోటివెంట నురగ, స్పృహ కోల్పోవడం, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో జిల్లా, విజయవాడ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారు. ఈ అంతుచిక్కని వ్యాధి మూలాలు తెలుసుకొనేందుకు జాతీయ, రాష్ట్ర సంస్థలు బాధితుల నివాస ప్రాంతాల్లో కూరగాయలు, చేపలు, పాలు, పండ్లు, భూగర్భ జలాలు, తాగునీటి నమూనాలు సేకరించాయి. బాధితుల నుంచి రక్తం, మూత్రం, మలం, వాంతి, వెన్ను ద్రవం నమూనాలను పరీక్షించి, ఫలితాలు వెల్లడించాయి. వీటిని 21 మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీ క్రోడీకరించి, బాధితుల అభిప్రాయాలు, వారి అనారోగ్యం, నివాస ప్రాంతాల్లో పరిస్థితులపై అధ్యయనం చేసి, నివేదికను తయారుచేసింది. పూర్తయిన నివేదికకు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు.
అంతుచిక్కని వ్యాధికి 3 కారణాలు ఉండొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
1. ఇన్‌ఫెక్షన్లు
2. జీవక్రియ సమస్యలు
3. విషపూరిత రసాయనాలు
ఇన్‌ఫెక్షన్లు: ఇన్‌ఫెక్షన్ల వల్లే సమస్య తలెత్తితే ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. మరణాలూ ఎక్కువగానే సంభవించేవి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. నమూనాల పరీక్షల్లోనూ ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లుగా బయటపడలేదు.
జీవక్రియ సమస్యలు: ఇదే కారణమైతే రక్త నమూనాల పరీక్షల ఫలితాలు అసాధారణ స్థాయిలో ఉండేవి. ఇవేమీ కనిపించలేదు.
విషపూరిత రసాయనాలు
వీటిలో రెండు రకాలు ఉన్నాయి. 1.భారలోహాలు. 2.పురుగు మందులు.
భార లోహాలు: బాధితుల రక్త నమూనాల్లో భారలోహాలు ఉన్నట్లు గుర్తించినా.. అది యాదృచ్ఛికమే కావొచ్చు. సమస్య వీటివల్లనే తలెత్తి ఉంటే.. భారలోహాల స్థాయి చాలా ఎక్కువగా ఉండేది, బాధితులు 3-4 గంటల్లో కోలుకునేవారూ కారు.
పురుగు మందులు: పురుగుమందుల్లో ఉండే ఆర్గానో ఫాస్ఫేట్లు, ఆర్గానో క్లోరైడ్లలో ఏదో ఒకదానివల్ల సమస్య వచ్చి ఉండొచ్చని కమిటీ భావించింది. రోగుల రక్త నమూనాలు, అక్కడి నీటి నమూనాల్లో ఆర్గానో ఫాస్ఫేట్లు కనిపించాయి. అయితే.. దీనివల్లే బాధితులు అనారోగ్యం పాలైతే విరేచనాలు, దగ్గు, ఆయాసం, చూపు మందగించడం వంటి లక్షణాలుండేవి. వీరిలో అవేవీ లేవు. కాబట్టి ఆర్గానో ఫాస్ఫేట్ కారణం కాకపోవచ్చు.
ఎలా వచ్చి ఉండొచ్చు..
కలుపు నివారణకు వాడే ‘మెట్రిబుజిన్’ అనే రసాయనాన్ని బాధితుల ఇళ్ల నుంచి సేకరించిన టమాటా, వంకాయల్లో గుర్తించినట్లు ఉన్నతస్థాయి కమిటీ పేర్కొంది. కూరగాయలు పండించేటప్పుడే ఇది ఉంటే.. సమస్య కేవలం ఏలూరు నగరానికే పరిమితం అయ్యేది కాదని, చుట్టుపక్కల గ్రామాలకూ వ్యాపించేదని.. కానీ అలా జరగలేదని గుర్తుచేసింది. అందువల్ల కూరగాయలు ఏలూరు మార్కెట్‌కు చేరిన తర్వాతే కొంత కలుషితమై ఉండొచ్చని అభిప్రాయపడింది. అయితే రాష్ట్రంలో మెట్రిబుజిన్ కలుపు మందు వాడకం చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని... అలాగే పంటల సాగులో ఆర్గానోక్లోరైడ్ల వాడకం కూడా చాలాకాలం నుంచి లేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. నీళ్లలో ఆర్గానోక్లోరైడ్ ఉన్న ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదు. మరోవైపు.. తాగునీటి నమూనాల్లో ట్రైజోఫాస్ అనే రసాయనం (ఆర్గానోఫాస్ఫేట్) ఉంది గానీ, అది అనుమతించదగ్గ పరిమాణంలోనే ఉన్నట్లు గుర్తించారు. అయితే ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని తాగునీటి సరఫరా వ్యవస్థను కొన్ని నెలల పాటు విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఒక అభిప్రాయానికి రావాలని నిపుణులు అభిప్రాయానికి వచ్చారు.
భవిష్యత్తులో ఈ తరహా సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం స్వల్ప, దీర్ఘకాలాల్లో చేపట్టాల్సిన చర్యలను నిపుణుల కమిటీ సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా నీటి పరీక్షలు
ఏలూరు కాలువను శుభ్రం చేయాలి. తాగునీటి నమూనాల సేకరణ, పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా జరగాలి. ఇందులో ఆర్గానో ఫాస్పేట్స్, ఆర్గానో క్లోరైడ్ ఉనికిని పరీక్షించాలి. భూగర్భ జలాల్లోకి చెత్తాచెదారం, వ్యర్థాలు పోకుండా చూడాలి. పైపులైన్ల పనితీరు, నీటికి తగ్గ ప్రెజర్ ఉందా.. లేదా అన్నది పరిశీలించాలి. పొలాల్లో వాడే రసాయనాల నాణ్యతపై వ్యవసాయశాఖ తగిన చర్యలు తీసుకోవాలి.
దీర్ఘకాలంలో తీసుకోవాల్సిన చర్యలు
ఎయిమ్స్, ఐఐసీటీ, నీరి సంస్థల ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో నీరు, ఆహారం, గాలి నమూనాల పరీక్షలు చేయించాలి. ఈ జిల్లాల్లో భారలోహాల ఉనికినీ పరీక్షించాలి. పీసీబీ కూడా ఈ అంశాన్ని పరిశీలించాలి. పారిశ్రామిక వ్యర్థాలను పర్యవేక్షించాలి. డీడీటీ, డీడీఈ, ఎండోసల్ఫాన్ పొలాలకు చేరకుండా వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలి. ఆక్వాలో మందుల వాడకం తగ్గించాలి. విశాఖ, గుంటూరు, తిరుపతి నగరాల్లో రాష్ట్రస్థాయిలో ప్రయోగశాలలు ఏర్పాటుచేయాలి. పాలు, ఆహారం, నీరు, రక్తం, కూరగాయల్లో ఆర్గానో క్లోరైడ్, ఆర్గానో ఫాస్ఫేట్లు ఉన్నాయో లేవో తెలుసుకొనేలా వీటిలో పరీక్షలు జరగాలి.
కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..
ఉన్నతస్థాయి కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. వ్యవసాయ, పశుసంవర్థకశాఖ, పర్యావరణ, అటవీ, శాస్త్రసాంకేతిక, వైద్యఆరోగ్యశాఖ అధికారులు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, దిల్లీ, మంగళగిరి ఎయిమ్స్, సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్‌ఐఎన్, ఎన్‌సీడీసీ, ఐసీఎంఆర్-ఎన్‌ఐవీ, సీనియర్ వైద్యులు సభ్యులుగా ఉన్నారు.
ఆర్గానో క్లోరైడ్ ఎలా వచ్చింది?
ఆర్గానో క్లోరైడ్ వల్లే బాధితులు అనారోగ్యానికి గురయ్యారని కమిటీ బలంగా అభిప్రాయపడింది. కానీ.. ఆర్గానో క్లోరైడ్లు బాధితుల రక్త నమూనాల్లో కనిపించలేదు. వ్యాధి లక్షణాలు, రోగులు కోలుకోవడం చూస్తే ఆర్గానో క్లోరైడ్ వల్లే ఇదంతా జరిగిందనిపిస్తోంది. శరీరంలోకి చేరిన 24 గంటల తర్వాత పరీక్షిస్తే ఆర్గానో క్లోరైడ్ ప్రభావం కనిపించదు. అందుకే బాధితుల రక్త నమూనాల్లో అది లేదు. కానీ వ్యాధి లక్షణాలన్నీ దీనికి బాగా దగ్గరగా ఉన్నాయి. నీరు, పాలు, కూరగాయలు, పండ్ల వాడకం ద్వారా బాధితుల శరీరంలోకి ఆర్గానో క్లోరైడ్ వెళ్లి ఉండొచ్చని, వీటిలోనూ కూరగాయలే ప్రధాన కారణం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బాధితుల్లో చాలామంది రెండు, మూడు రోజుల ముందు మాంసాహారం తీసుకోలేదు కాబట్టి.. కూరగాయల నుంచే ఇది వచ్చి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే పంటల సాగులో ఆర్గానోక్లోరైడ్ల వాడకం చాలాకాలం నుంచి లేదని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అజాగ్రత్తగా ఉంటే ముప్పే... మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు