గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తోన్న భారత ఆహార సంస్థ ఉద్యోగులకు పౌర సరఫరాల సంస్థ మొదటి విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ (Vaccination drive) చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని సనత్‌నగర్‌లో సంస్థ తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ అశ్వనీ కుమార్ గుప్తా ప్రారంభించారు. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ… గతేడాది లాక్ డౌన్ సమయం నుంచి ఎఫ్‌సీఐ తెలంగాణ అద్భుతమైన పనితీరును కనబరుస్తోందని గుప్తా అన్నారు. ఎన్నో సవాళ్లను దాటుకుని రికార్డు స్థాయి కొనుగోళ్లు, సరఫరాతో దేశానికే ఆహార ధాన్యాగారంగా నిలిచిందన్నారు.
విపత్కర పరిస్థితుల్లో ఎంతో అమూల్యమైన సేవలందిస్తోన్న వైద్యారోగ్య శాఖ సిబ్బందికి, ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ సౌకర్యాన్ని సిబ్బంది పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన దాదాపు 1,475 మంది సిబ్బందికి తమ పని ప్రదేశాలు, సమీప ఆరోగ్య కేంద్రంలో టీకా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజనల్ మేనేజర్ రవిరాజ్ భట్టల్వార్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.