ఎంతో కాలంగా భారత్‌తో మిత్ర దేశాలుగా ఉన్న సరిహద్దు దేశాలు మోదీ వైఖరి కారణంగా శతృ దేశాలుగా మారాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఆరోపించారు. మోదీ విదేశీ పర్యటనల వల్ల దేశానికి ప్రయోజనం ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏఐసీసీ సూచనల మేరకు గాంధీ భవన్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద అమర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులర్పించింది. అమర వీరుల కోసం కాంగ్రెస్ సలాం పేరున మౌన దీక్ష చేపట్టింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇండియా కోసం చైనా సరిహద్దుల్లో ప్రాణాలు విడిచిన కర్నల్ సంతోష్ బాబు తెలంగాణ చరిత్రలో నిలిచి పోతారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భాజపా ప్రభుత్వ హయాంలో 20మంది మృతితో మోదీ పనితీరు ఏంటో దేశం గమనిస్తోందని పేర్కొన్నారు.
45 ఏళ్ల పాటు ఇండో-చైనా సరిహద్దులో ఒక్క ప్రాణం కూడా పోలేదని గుర్తు చేశారు. చైనా ఆర్మీ తక్షణమే ఇండియా భూ భాగం నుంచి వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న పీవీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. పీవీ నరసింహారావు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల గుండెల్లో ఉంటారని అభిప్రాయపడ్డారు.
ఇవీచూడండి: సిరిసిల్ల జిల్లాలో హరితహారం.. మొక్కలు నాటిన కేటీఆర్, పోచారం