Uttam Kumar comments On Civil Servants: రాష్ట్రంలో సివిల్ సర్వీస్ వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రష్ఠు పట్టిస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. 14 మంది సీనియర్ ఐఏఎస్ అధికార్లను పక్కనపెట్టి సోమేశ్ కుమార్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవడం అక్రమమని ధ్వజమెత్తారు. సోమేశ్ కుమార్ తెలంగాణకు కేటాయించిన అధికారి కాదని... ఏపీకి కేటాయించిన అధికారి అని తెలిపారు. సోమేశ్‌పై కేసీఆర్‌కు ఎందుకంత ప్రేమని ప్రశ్నించారు. 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు రెండేళ్లపాటు పోస్టింగ్ ఇవ్వలేదని ఉత్తమ్ విమర్శించారు.
"తెరాసకు అనుకూలంగా ఉండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు.. పది, పదిహేను శాఖలు కేటాయించి.. మిగిలిన అధికారులను ఖాళీగా ఉంచి అవమానిస్తున్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల ఎస్పీలు.. అసలు ఐపీఎస్ చేయలేదు. స్వతంత్రంగా ఉండే వారు కాకుండా ప్రభుత్వం చెప్పినట్లు వినేవారికే హోదాలు ఇస్తున్నారు. రాష్ట్రాన్ని తన సొంత జాగీరుగా కేసీఆర్ మార్చుకున్నారు." -ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేంద్రం ఐఏఎస్ బదిలీలను తప్పుబడుతున్న కేసీఆర్... రాష్ట్రంలో మాత్రం సరైన విధానాలు అవలంబించడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చేందుకు సివిల్ సర్వీసు అధికారులు వెనకడుగేస్తున్నారని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెరాసకు తొత్తులుగా వ్యవహరించే అధికారులకే ప్రభుత్వం మంచి హోదా ఇస్తోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకే రజత్ కుమార్‌కు నీటిపారుదల శాఖలో పోస్టింగ్ ఇచ్చారని ధ్వజమెత్తారు. రజత్ కుమార్ వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దేశంలో సీఎం కేసీఆర్ చేసిన అవినీతి ఎవ్వరూ చేయలేదని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటున్న తీరును పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలకు సీఎస్ సోమేశ్ కుమార్ అపాయిట్మెంట్ కూడా ఇవ్వరని.. రాష్ట్రాన్ని తన సొంత జాగీరులా సీఎం కేసీఆర్ భావిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Mahmood ali on Drugs: 'డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం... మూలాలు లేకుండా చేస్తాం'