FAO Report on Farmlands: ‘‘వ్యవసాయ రంగం ఐదు పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. పైపెచ్చు ప్రస్తుత సాగు పద్ధతుల వల్ల సుస్థిరతను సాధించడం అసాధ్యమవుతోంది. భూమి, నీటి వనరులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు నానాటికీ తగ్గిపోవడం అటుంచి ఉత్పాదకత పడిపోతోంది. మొత్తంగా ఈ పరిణామాలు ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆహార భద్రత ప్రమాదంలో పడటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉత్పాదకత పెంచడం, ఇందుకోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, వాతావారణంలో వచ్చే మార్పులను తట్టుకునే సేద్యపు విధానాలను అనుసరించడం కీలకమని’’ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆహార-వ్యవసాయ సంస్థ (యు.ఎన్-ఎఫ్.ఎ.ఓ) అభిప్రాయపడింది. ‘‘ఆహార భద్రత, సాగు విస్తీర్ణంలో కీలకమైన భూమి, నీరు ఎదుర్కొంటున్న సవాళ్లు-2021’’ నివేదికను ఈ సంస్థ విడుదల చేసింది. ఇందులో ముఖ్యాంశాలిలా..
పట్టణీకరణలో సమిధలుగా వ్యవసాయ భూములు
2000వ సంవత్సరంలో పట్టణ ప్రాంతాలు భూమిలో 0.5 శాతాన్ని ఆక్రమించి ఉండేవి. తర్వాత వేగంగా పెరిగిన పట్టణీకరణ వల్ల ప్రపంచంలోని 55 శాతం జనాభా నగరీకరణలోకి మారింది. ఫలితంగా సేద్యం, పశు సంపదకోసం అందుబాటులో ఉండే భూమి 2000 నుంచి 2017 సంవత్సరాల మధ్య సగటున 20 శాతం తగ్గింది. ఇది సేద్యంపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఉదాహరణకు ప్రపంచ సాగు విస్తీర్ణం వార్షిక వృద్ధి 1961 నుంచి 2009 వరకు 1.6 శాతం కంటే ఎక్కువగా, కొన్ని పేద దేశాల్లో రెండు శాతం వరకు ఉంది. తాజా అంచనా ప్రకారం రానున్న రోజుల్లో అది 0.14 శాతం కంటే పెరిగే పరిస్థితి లేదు. 2050 నాటికి ప్రపంచం ఆకలి నుంచి బయటపడాలంటే సాగు విస్తీర్ణం 165 మిలియన్ హెక్టార్లకు పెరగాలి. కానీ 91 మిలియన్ హెక్టార్లకే పరిమితం కానుంది. ఇవన్నీ ఆహార భద్రతను ప్రశ్నార్థకం చేయనున్నాయి.
‘చిన్న’బోతున్న కమతాలు
వ్యవసాయ పద్ధతుల్లో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. సాగుభూమి వినియోగంలో భారీ వాణిజ్య కమతాల ఆధిపత్యం పెరిగింది. చిన్న కమతాలు మరింత చిన్నవిగా మారడంతోపాటు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భూమి సారాన్ని కోల్పోవడం, నీటి కొరత, రసాయనిక ఎరువుల వినియోగం పెరగడం ఫలితంగా పెరుగుతున్న నీటి కాలుష్యం, పంటల మార్పిడి లేకపోవడం, తదితర సమస్యలు నేటి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా మారాయి.
దీర్ఘకాలం ఒకే పంట
2000వ సంవత్సరం నుంచి సాగు పద్ధతులు, విస్తీర్ణంలో పెద్దగా మార్పు లేదు. పైగా ఎక్కువకాలం కొనసాగే పంటల సాగు పెరిగింది. 2000-2019 సంవత్సరాల మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా తాత్కాలిక పంటలు సాగుచేసే విస్తీర్ణం 24 మిలియన్ హెక్టార్లు తగ్గితే, శాశ్వత పంటలు(దీర్ఘకాలం ఒకే పంట) సాగుచేసే విస్తీర్ణం 36 మిలియన్ హెక్టార్లు పెరిగింది. పంట మార్పిడి అనే మాటే లేదు. మరోవైపు పచ్చికబయళ్లు చాలావరకు తగ్గాయి. అటవీ విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. ఇవన్నీ వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి.
2014లో 60.40 కోట్ల మంది పౌష్టికాహారలోపం సమస్యను ఎదుర్కొన్నారు. 2020 నాటికి అది 76.8 కోట్లకు పెరిగింది. 2050 నాటికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం కన్పించడం లేదు. పైపెచ్చు జనాభా పెరుగుదల, పట్ణణీకరణతో వ్యవసాయ భూమి కనుమరుగవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పాదకత పెంచడం అత్యంత కీలకం.
ప్రపంచ వ్యాప్తంగా 33 శాతం భూమి సారాన్ని కోల్పోయింది. ముఖ్యంగా పైభాగంలో ఉన్న సారవంతమైన నేల పొర ఏడాదికి 2000-3,700 కోట్ల టన్నుల మేర కోతకు గురవుతోంది. దీనివల్ల పంటల ఉత్పాదకత తగ్గుతోంది. నేల నీటిని, పోషకాలను ఒడిసిపట్టే స్వభావాన్ని కోల్పోతోంది. పైగా భూమి ఉప్పు నేలలుగా మారడం ఎక్కువైంది. భూఉపరితలం నుంచి 30-100 సెం.మీ లోతు వరకు లవణ లక్షణాలు ఉంటున్నాయి. దీనివల్ల ప్రతి సంవత్సరం 15 లక్షల హెక్టార్ల సాగుభూమి ఉత్పత్తిని కోల్పోయింది.
సేద్యం ప్రమాదంలో పడేందుకు కారణమైన పరిణామాలను చెబుతూనే.. పరిష్కార మార్గాలనూ యు.ఎన్-ఎఫ్.ఎ.ఓ సూచించింది. ఆ వివరాలిలా..
వర్షాన్ని ఒడిసిపట్టాలి
సాగుభూమిలో 80 శాతం వర్షాధారమే. ఇందులోనే ప్రపంచానికి అవసరమైన ఆహారంలో 60 శాతం పండుతుంది. 20 శాతం సాగునీటి వసతి ఉన్న భూమిలో నలభై శాతం దిగుబడి వస్తోంది. వర్షపు నీటిని ఎక్కువగా ఒడిసిపట్టడం, భూమిలో తేమశాతం ఉండేలా చూసుకోవడం, భూమి కోతకు గురికాకుండా కాపాడుకోవడం వల్ల వర్షాధార భూమిలోనూ ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది.
యాజమాన్య పద్ధతుల్లో మార్పులు
నేల, నీటి యాజమాన్య పద్ధతుల్లో మార్పులపైనే వ్యవసాయ ఉత్పత్తి ఆధారపడి ఉంది. ఈ రెండింటినీ సమన్వయపరిచే విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భూమి సారాన్ని కోల్పోకుండా చూడటం, కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యలు తీసుకోవడం, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఉపరితల, భూగర్భ జలాల కాలుష్యాన్ని నివారించడం వంటివి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.
- యాజమాన్య పద్ధతుల్లో మార్పులకు సంబంధించిన సాంకేతికత పరిజ్ఞానం, దాని తాలూకు ప్రయోజనాలు చాలా మందికి దక్కడం లేదు. ముఖ్యంగా చిన్న కమతాల రైతులు, సామాజికంగా వెనకబడిన వర్గాలు సాంకేతికతను అందిపుచ్చుకోలేకున్నాయి. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలి.
పెట్టుబడుల లక్ష్యం సహజ వనరుల సంరక్షణ కావాలి
వ్యవసాయ రంగానికి ఇచ్చే పెట్టుబడులు, రాయితీలు భూమి, నీటి యాజమాన్యానికి సంబంధించిన సాంకేతికతపైనే ఎక్కువగా ఉండాలి. స్థూలంగా ఈ పెట్టుబడులు దీర్ఘకాలంలో సహజ వనరుల సంరక్షణకు ఉపయోగపడేలా ఉండాలి.
- వాతావరణ మార్పులతో వస్తున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకొని పంటల సాగు పద్ధతిలో మార్పులు చేయాలి. అందుకో విధానం కావాలి.
ఇదీ చూడండి: ముంబయిలో ఒక్కరోజే 8 వేల కరోనా కేసులు- బంగాల్లోనూ..