కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు రోజులు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వెల్లడించింది. ఈ ఆందోళనలో వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న పది లక్షల మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొననున్నారని తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 15, 16 తేదీల్లో నిరసన చేపడుతామని యూనియన్ కన్వీనర్ శ్రీరామ్ స్పష్టం చేశారు.
దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులే కారణమని శ్రీరామ్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని మారుమూల గ్రామల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల పనితీరు మెరుగనే భావనతో నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ప్రైవేట్ బ్యాంకుల అనాలోచిత నిర్ణయాలతో కార్పొరేట్ సంస్థలకు కోట్లల్లో రుణాలు ఇచ్చి.. వసూళ్లు చేయలేక మూతపడిన ఘటనలు చూస్తున్నామన్నారు. ప్రైవేట్ బ్యాంకులకు సామాజిక బాధ్యత ఉండదని... కేవలం లాభాపేక్షే ధ్యేయంగా పని చేస్తాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మరో 50 ఏళ్లు వెనక్కెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని... సమ్మెకు మద్దతు పలకాలని యూనియన్ నాయకుడు వెంకటరమణ కోరారు.