నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను, ఆయన పోరాట స్ఫూర్తిని నేటి యువత అందిపుచ్చుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నేతాజీ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు. స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా... భరతమాత సంకెళ్లను తొలగించేందుకు చేసిన ఉద్యమం ఎంతో గొప్పదని కొనియాడారు. భారత యువకులను సంఘటితం చేసి స్వతంత్ర పోరాటంలో తమదైన శైలిలో పోరాడిన ఘనత నేతాజీకి దక్కుతుందని అన్నారు.
నేతాజీ 125 వ జయంతి వేడుకలను భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నేడు కోల్‌కతాకు ప్రధాని మోదీ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. నేతాజీ స్ఫూర్తితో ప్రపంచ దేశాల్లో భారత దేశాన్ని శక్తివంతమైన దేశంగా నిర్మించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపికా, రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ సుచిత్రతో పాటు పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'నేతాజీ.. భారతావని పరాక్రమ పతాక'