Ugadi Celebration at BJP Office in Hyderabad: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలు, పాడి పంటలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ సందర్భంగా అన్ని సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి నీతివంతమైన పాలన, దేశం కోసం, దేశాభివృద్ధి కోసం దేశభక్తితో పనిచేసే నాయకత్వం రావడానికి ప్రజలందరి ఆశీస్సులు కావాలని కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు.
దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలి: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు ముఖ్యమైన సంవత్సరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఉగాది పర్వదినం సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించి.. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కిషన్‌రెడ్డి కోరారు.
"నీతివంతమైన పాలన, దేశం కోసం, దేశాభివృద్ధి కోసం దేశభక్తితో పని చేసే నాయకత్వం రావాలి. అందుకు ప్రజల ఆశీస్సులు కావాలి. ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు ముఖ్యమైన సంవత్సరం. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించి.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలి.'' - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ఈ క్రమంలోనే బీజేపీ కార్యాలయంలో మంగళంపల్లి శ్రీనివాసశర్మ ఉగాది పంచాంగ శ్రవణం వినిపించారు. శోభకృత్ నామ సంవత్సరంలో ధరల హెచ్చుతగ్గులు మినహా.. మిగిలినవన్నీ శుభ ఫలితాలను ఇస్తాయని తెలిపారు. మాగాణి, మెట్ట పంటలు బాగా పండుతాయని వివరించారు. గాలి దుమారం వంటి ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. వెండి, బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. నిత్యావసర వస్తువులు, నూనె ధరలు బాగా పెరిగే అవకాశం ఉందని శ్రీనివాసశర్మ స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, అరవింద్ మీనన్, విజయశాంతి, రాంచందర్ రావు, వివేక్, ఏవీఎన్ రెడ్డి , ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం.. ఈ అంశమే ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి కాంగ్రెస్..
మోదీపై వివాదాస్పద పోస్టర్లు.. 100 FIRలు నమోదు చేసిన పోలీసులు.. ఆ పార్టీ నేతలే!