దేశ భవిష్యత్ గురించి నిత్యం ఆలోచించిన మహనీయుడు అబ్దుల్ కలాం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో యువతను చైతన్యపరచి ముందుంచారని... భారత శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమని కిషన్‌రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో జస్టిస్ చంద్రయ్యతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
దార్శనికుడు కలా..
దేశం గర్వించదగిన వ్యక్తి, దార్శనికుడు కలాం అని కొనియాడారు. భారతదేశం ఎప్పుడూ ఎవరి వద్ద తలవంచకూడదని.. చేయిచాచకూడదని కోరుకున్నారని తెలిపారు. దేశాభివృద్ధిలో యువతను చైతన్యపరిచారని(kishan reddy about abdul kalam) గుర్తు చేశారు. దేశ భవిష్యత్ గురించి ఆయన ఎంతగానో ఆలోచన చేశారని... దేశం ఎల్లప్పుడూ తలెత్తుకునేలా చేశారని గుర్తు చేశారు.
భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప శాస్త్రవేత్త, గొప్ప దార్శనికుడు. వారి చివరి శ్వాస వరకు కూడా దేశం కోసం, సమాజం కోసం, దేశ భవిష్యత్ కోసం ఆయన కలలు కన్నారు. ఆ కలలు సార్థకం చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. వారి సందేశం వింటే, వారు చేసిన కార్యక్రమాలు తెలుసుకుంటే ఆయన ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో భారతదేశం ఎవరికీ తలవంచి ఉండకూడదు... భారతదేశం తలఎత్తుకొని తిరగాలి... నా దేశంలోని యువత కూడా ప్రపంచంతోని పోటీ పడే విధంగా భారతదేశాన్ని నిర్మాణం చేసుకుంటుందనే గొప్ప సందేశాన్ని ఎల్లప్పుడూ ఇచ్చేవారు.
-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
ప్రపంచంతో పోటీపడి అద్భుత వ్యాక్సిన్
ప్రతీ యువకుడు దేశం కోసం, సమాజం కోసం పని చేయాలని చెప్పారని అన్నారు. కరోనాను ఎదుర్కొవడానికి ప్రపంచంతో పోటీపడి అద్భుతమైన వ్యాక్సిన్(india corona vaccine) కనుగొన్నామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి తెలియజేశారు. ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్‌తో ముందుకెళ్తున్నామన్నారు. భారతదేశం 2047నాటికి విశ్వగురు స్థానానికి వెళ్లాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.
ఎంతసేపటికీ మనం ఈరోజు గవర్నమెంట్ ఏం చేసింది? కరెంట్ పోతే, బస్ లేట్ అయితే, ట్రైయిన్ లేట్ అయితే, రోడ్డు బాగా లేకపోతే... గవర్నమెంట్‌ను తిట్టుకుంటూ కూచుంటాం. చీకట్లో చిరుదీపం వెలిగించే ప్రయత్నం మనమందరం చేయాలి. గవర్నమెంట్ మీద ఒకటే బాధ్యత కాదు. ఈ దేశ పౌరులుగా ప్రతిఒక్కరూ శక్తివంతంగా నిర్మాణం చేస్తున్న కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకున్న వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం.
-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
ఇదీ చదవండి: