కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తెరాస నేతలు కేంద్రంపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. చిరు వ్యాపారులు, మహిళా పొదుపు సంఘాలు, పేద ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేలా ప్రధాని మోదీ పని చేస్తున్నారని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో తెలంగాణకు ఏం వచ్చిందని కేసీఆర్ అంటున్నారన్న కిషన్‌రెడ్డి.. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడిందని తెలిపారు. గత ఏడాది నుంచి పేదవాళ్లందరికి 5 కిలోల బియ్యం కేంద్రం నుంచే అందిస్తున్నామని వివరించారు.
ప్రభుత్వం ఎన్ని వెంటిలేటర్లు కొన్నది..
రాష్ట్రంలో 3 లక్షల పీపీఈ కిట్లు, 15 లక్షల ఎన్-95 మాస్కులు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఎంపోటెరిసన్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు, వ్యాక్సినేషన్ సెంటర్.. ఇలా అన్ని రకాలుగా కేంద్రం ఆదుకుంటోందని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 46 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 1,400 వెంటిలేటర్లు ఇచ్చామన్నారు. మరి తెరాస ప్రభుత్వం ఎన్ని వెంటిలేటర్లు కొన్నదని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర నిధులతోనే ధాన్యం కొనుగోళ్లు..
కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. సన్న వడ్లు పండించమని రైతులను ఇబ్బందిపెట్టి... నష్టాలకు సీఎం కేసీఆర్ కారణమయ్యారని ధ్వజమెత్తారు. హుజురాబాద్‌లో పోటీ భాజపా, తెరాస మధ్యే ఉంటుందని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే గాంధీ భవన్ దారంతా మళ్లీ తెలంగాణ భవన్‌కే మళ్లుతుందని విమర్శించారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని స్పష్టం చేశారు.
REVANTH REDDY: 'కృష్ణా జలాలను కాపాడటం కంటే సీఎం కేసీఆర్‌కు పనులేమున్నాయి'