Kishan Reddy Fires on CM KCR: తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న పలు అభివృద్ది కార్యక్రమాల గురించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. రామగుండంలో రైతుల కోసం యూరియా పరిశ్రమను ప్రధాని జాతికి అంకింతం చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం రెట్టింపు అయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే రూ.650 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన ఆయన.. సికింద్రాబాద్‌కు వందే భారత్ రైలును కూడా మోదీ సర్కారు కేటాయించినట్లు తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి విషయంలో మోదీ సర్కారు ఎప్పుడూ వెనక్కి తగ్గదని కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రధానికి.. ముఖ్యమంత్రి స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తుందని.. రాష్ట్రంలోనే ఎక్కడా లేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తోందని అభిప్రాయపడిన ఆయన.. మహిళ అని కూడా చూడకుండా గవర్నర్‌ను కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు.
ప్రధాని మోదీ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తే నిరసనలు చేయడం దారుణమని తెలిపారు. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా.. మోదీని అడ్డుకోలేరని అన్నారు. రాష్ట్రంలో గిరిజన వర్సిటీ, సైన్సు సిటీ కోసం భూమి అడిగితే కేసీఆర్ ఇవ్వట్లేదని ఆరోపించిన కిషన్ రెడ్డి.. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: