Kishan Reddy Comments on CM KCR: భాజపా ఎవరి దయాదాక్షిణ్యాల మీద పని చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భాజపాపై మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్కు త్వరలోనే గౌరవంగానే సమాధానం చెబుతామని వ్యాఖ్యానించారు. ఎవరికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం చేస్తామంటే తాము కూడా అదే తరహాలో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. త్వరలోనే కేసీఆర్ వ్యాఖ్యలపై సమగ్రంగా మాట్లాడతానని పేర్కొన్నారు.
మేం సిద్ధమే
"ఎవరి దయాదాక్షిణ్యాలపై భాజపా పని చేయడం లేదు. ప్రజల ఆదరణతో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం చేస్తామంటే మేం సిద్ధమే. గౌరవ ముఖ్యమంత్రికి త్వరలో గౌరవంగానే సమాధానం చెప్తాం." -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
అంతర్జాతీయ మ్యూజియం సదస్సు
ఈ నెల 15, 16 తేదీల్లో అంతర్జాతీయ మ్యూజియం సదస్సును.. హైదరాబాద్ వేదికగా సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని మ్యూజియాలను అభివృద్ధి చేస్తామని.. కొత్త వాటిని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ విస్టాలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లో కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేస్తామన్నారు. జమ్మూ కశ్మీర్ చరిత్ర, బిర్సా ముండా చరిత్ర పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గిరిజన మ్యూజియం కోసం రాష్ట్రానికి రూ. కోటి కేటాయించామని.. రూ.15 కోట్లతో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్థలాన్ని కేటాయించలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: తూర్పు హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ: కేటీఆర్