Union Minister Anurag Thakur Fire on KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సొంత కుటుంబానికి తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన అనురాగ్ ఠాకూర్ కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు.
కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కోటలో కూర్చున్న కేసీఆర్‌కు పేదల సంక్షేమం పట్టదా? అని నిలదీశారు. హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పిన సీఎం.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు."ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా?" అని నిలదీశారు. జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమైందన్న ఆయన.. తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారని దుయ్యబట్టారు.
కర్ణాటకలో ఎన్నో స్టార్టప్ కంపెనీలు, పెట్టుబడులు వస్తున్నాయని.. తెలంగాణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అవినీతి పెరిగి పోయినందునే పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్న మంత్రి ఠాకూర్.. జాతీయ రహదారులు, ఉచిత బియ్యం వంటి ఎన్నోపథకాలను కేంద్రం దేశ వ్యాప్తంగా అమలు చేస్తోందన్నారు.
అభివృద్ధి పనులను విస్తరించేందుకు కేంద్రం చొరవ చూపిస్తుంటే భూములు ఇవ్వడం లేదని తెలిపారు. నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ల తరుపున వారే న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దానిని సీఎం కేసీఆర్ టెక్నిక్‌గా భావిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన పార్టీకి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం కమలం పార్టీ దేనని జోస్యం చెప్పిన మంత్రి బురదలో ఉన్నా కమలం వికసిస్తుందన్నారు.
ప్రధాని మోదీ రాకముందు సాయం కోసం ఇతర దేశాల వైపు దిక్కులు చూసేవాళ్లమని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం వస్తువులను దిగుమతి కాదు.. ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
బీజేపీ కార్నర్ సమావేశాలపై బండి సంజయ్ రివ్యూ.. లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశాలు
మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను అందరూ వీక్షించాలి: కిషన్ రెడ్డి
వైద్య విద్యార్థిని ఆరోగ్యంపై ఈటల ఆరా.. ప్రభుత్వానికి మూడు డిమాండ్లు