తెలంగాణ ఉద్యమ సమయంలో గుజరాత్‌లో ఉన్న నేను కేసీఆర్ ఉపన్యాసాలు వినేవాణ్ని. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తామని మాట్లాడేవారు. ఈ రోజు సీఎంను అడుగుతున్నా.. ఇప్పుడేమైంది మీ బాస?
కర్ణాటక, మహారాష్ట్రల్లో సంబరాలు చేసుకుంటుంటేే.. తెలంగాణలో ఎందుకు చేసుకోవడం లేదు? మీకు ఎవరి భయం ఉందో తెలుసు. కానీ భాజపా ఎవరికీ భయపడదు. మేం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం.
తెలంగాణలో బండి సంజయ్ సంగ్రామ యాత్ర చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల విముక్తికి ఈ పోరాటం మొదలుపెట్టారు. తెరాసలో ఉన్న రాజేందర్ బయటకు ఎందుకు వచ్చారు? ఆ పార్టీలో కుమార్తె, కొడుకుకు తప్ప మరొకరికి అవకాశం లేదు. అందుకే తెలంగాణ వెనుకబడుతోంది. రాష్ట్ర పేదలు, ఆదివాసీలు, దళితులు, సోదరీమణుల రక్షణ కోసం సంజయ్ పోరాటం చేస్తున్నారు.
- అమిత్‌షా
తెలంగాణలో కారు కేసీఆర్‌దైతే, స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. ఒవైసీకి భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మతం ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, దీనికి భాజపా ఒప్పుకోబోదన్నారు. ఈ రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అంతరించిపోతోందని, రాష్ట్రంలో తెరాసకు ఎప్పుడూ ఆ పార్టీ ప్రత్యామ్నాయం కాదన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తే ఉందనుకున్నా..మజ్లిస్ భయంతో తెరాస చేసిన పనే చేస్తుందన్నారు. తెలంగాణలో డబ్బు, కుటుంబ రాజకీయాలు పారద్రోలాలని ప్రజలను కోరారు. శుక్రవారం నిర్మల్ క్రషర్ మైదానంలో నిర్వహించిన ‘తెలంగాణ విమోచన దినోత్సవ’ బహిరంగ సభలో ముఖ్యఅతిథిÅగా అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్, ఆదివాసీ స్వాతంత్య్ర పోరాట యోధులు రాంజీగోండ్, కుమురంభీంలకు నివాళులర్పించారు. తెలంగాణ గౌరవ పునస్థాపన కోసం భాజపా సర్కారు ఏర్పాటుకు తోడ్పడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లు, లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లు ఇవ్వాలని కోరారు. ‘సెప్టెంబరు 17న తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. పటేల్ పరాక్రమానికి తోడు రాంజీగోండ్, కుమురంభీం, స్వామిరామానందతీర్థ, పండిత్ నరేంద్ర, దాశరథి, సురవరం ప్రతాపరెడ్డి, రంగాచార్య, నరసింహారావు లాంటి అనేక మంది దేశభక్తుల త్యాగాలతో ఇది సాధ్యమైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తరువాత ఇక్కడి వారికి స్వేచ్ఛ లభించింది. ఈ విషయాన్ని సీఎంకు గుర్తు చేసేందుకు వచ్చా. నిర్మల్‌లోని ఆదివాసీలు రాంజీగోండ్ నేతృత్వంలో తొలుత బ్రిటిష్, ఆ తరువాత నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనతో సహా వేెయి మందిని పట్టుకుని 1860లో ఉరితీశారు. సీఎం కేసీఆర్...! మీకు వీరి బలిదానం గుర్తు లేదా? వీరి బలిదానాలు వృథా కావు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తప్పక నిర్వహిస్తాం.
ఒవైసీ శరణు కోరని సర్కారు కావాలి
తెలంగాణ ప్రజలు ఒవైసీ శరణు కోరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మజ్లిస్‌ను ఓడించినపుడే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ లభిస్తుంది. అది భాజపాతోనే సాధ్యం. దళితులు, ఆదివాసీలు, పేదల సంక్షేమం కోసం కుటుంబపాలనకు వ్యతిరేకంగా మోదీ నేతృత్వంలోని భాజపా పనిచేస్తుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు ఇచ్చారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ సీట్లిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లూ మోదీకే ఇవ్వాలి. ఏళ్ల తరవాత తెలంగాణకు.. భాజపా హయాంలో కేబినెట్ మంత్రి పదవి వచ్చింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తాచూపింది. తెరాస ఒవైసీ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. దేశంలో 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధిలో 130 కోట్ల మందికి సమాన అవకాశాలు, ప్రపంచంలో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ఈ వేడుకలు చేస్తున్నాం.
హుజూరాబాద్‌లో రాజన్నను గెలిపించాలి
తెలంగాణలో డబ్బుతో రాజకీయాలు చేయాలని తెరాస భావిస్తోంది. ఈ కుట్రలను అడ్డుకుని ప్రజలు హుజూరాబాద్‌లో రాజన్న(ఈటల)ను గెలిపించాలి. డబ్బు, కుటుంబ రాజకీయాలను అంతం చేయాలి. వచ్చే ఎన్నికల్లో భాజపా సర్కారు ఏర్పాటుకు బండి సంగ్రామయాత్రను సఫలం చేయాలి. భాజపా సర్కారు ఏర్పాటుతో తెలంగాణ గౌరవం పెంచుతాం. సంగ్రామయాత్రతో పాటు 119 నియోజకవర్గాల్లో జనజాగృతి రూపంలో ముందుకు వెళ్తాం.
పెద్దఎత్తున టీకా కార్యక్రమం
మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం భారీగా కరోనా టీకాల పంపిణీ చేస్తోంది. యువమోర్చా ప్రతినిధులు రక్తదానం చేశారు. ఎంపీ ధర్మపురి కరోనా పీడితులను ఆదుకుంటున్నారు. మోదీ నేతృత్వంలో పేదలకు ప్రయోజనాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని అమిత్‌షా మాట్లాడారు.
విమోచన దినం దస్త్రంపైనే తొలి సంతకం : కిషన్‌రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘భాజపా అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించే దస్త్రంపైనే తొలి సంతకం చేస్తాం. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అపవిత్రం చేసిన నిర్మల్ గడ్డపై సోయం బాపురావును ఎంపీగా గెలిపించడం, తెలంగాణ విమోచన దినాన్ని అమిత్‌షా నేతృత్వంలో జరపడం ద్వారా ప్రజలు పవిత్రం చేశారు. పటేల్ కన్నెర్ర చేస్తే రజ్వీ పారిపోయాడు.. ఇప్పుడు అభినవ సర్దార్ అమిత్‌షా ఉరిమితే కేసీఆర్ పారిపోవడం ఖాయం’ అన్నారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ నయానిజాంగా మారిన కేసీఆర్‌ను తెలంగాణ నుంచి వెళ్లగొట్టే సమయం దగ్గరపడిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సాగుచేసుకుంటున్న పోడుభూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎంపీ సోయం బాపురావు ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, డీకే అరుణ, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, నేతలు ఎన్‌వీఎస్ ప్రభాకర్, జితేందర్‌రెడ్డి, భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు పాల్గొన్నారు.
కమల దళంలో కదనోత్సాహం
నిర్మల్ సభ విజయవంతం కావడంతో కాషాయ దళంలో కదనోత్సాహం నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రేణులు తరలిరావడంతో క్రషర్ మైదానం కాషాయ వర్ణం సంతరించుకుంది. మధ్యాహ్నం 2.40కి నిర్మల్ చేరుకున్న అమిత్‌షా రాంజీగోండ్, కుమురంభీం, సర్దార్ పటేల్ చిత్రపటాలకు పూలుచల్లి నివాళులర్పించారు. సా. 3.48 నిమిషాల నుంచి 4.14 వరకు ప్రసంగించారు.
శభాష్ సంజయ్
సభ ముగిశాక హెలిప్యాడ్ వరకు అమిత్‌షా కారులో సంజయ్ వెళ్లారు. శభాష్ సంజయ్ అని అమిత్‌షా ఆయన భుజం తట్టి అభినందించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అక్టోబరు 2 నాటికి హుజూరాబాద్‌లో ప్రజాసంగ్రామ యాత్ర ముగుస్తుందన్న సంజయ్ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొనగా... ఇదే జోష్ కొనసాగించాలని హోంమంత్రి చెప్పారు.
కేసీఆర్ నీచ పాలనను పాఠ్యాంశం చేస్తాం : సంజయ్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘రాంజీగోండ్, కుమురంభీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి వీరుల త్యాగాలు, నిర్మల్, పరకాల, బైరాన్‌పల్లిలో జరిగిన వీరోచిత పోరాటాల ఫలితంగా తెలంగాణ విమోచన సాధ్యమైంది. ఇలాంటి దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఆసక్తి చూపని ముఖ్యమంత్రి కేసీఆర్ నీచ పాలనను భవిష్యత్తులో పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తాం. విమోచనదినాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడంలేదని ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్యను ప్రశ్నించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎంఐఎంకి భయపడి మరచిపోయారు. ఇప్పటికే రాష్ట్రాన్ని మేనల్లుడు, కుమార్తె, కొడుకుకి పంచిపెట్టారు. సీఎంను గద్దె దింపడానికి పౌరుషం ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ముందుకు రావాలి. మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన వారి కుటుంబాలకు భాజపా అధికారంలోకి రాగానే పింఛను సౌకర్యం కల్పిస్తాం. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా లేని దేశాన్ని ఊహించుకోవడం కష్టం’.
ఇదీ చూడండి: 'జీఎస్టీలోకి పెట్రో ధరలు తెచ్చేందుకు ఇది సమయం కాదు'