Sheep Distribution Scheme: గొర్రెల పంపిణీ పథకానికి నిధుల కొరత అడ్డంకిగా మారింది. దీంతో ప్రస్తుతం తాత్కాలికంగా పంపిణీ నిలిచిపోయింది. రెండో విడతలో 3.50 లక్షల మంది నిరుపేద గొర్రెల కాపరులకు రూ.6,125 కోట్ల వ్యయంతో జీవాలను పంపిణీ చేస్తామని పశుసంవర్ధకశాఖ ఏడాది కిందట చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కారణంగా గొర్రెల కొనుగోలు నిలిపివేసినట్లు ఆ శాఖ చెబుతోంది. కానీ పంపిణీకి అవసరమైన రుణం ఇంకా మంజూరు కాలేదని తేలింది. రూ.6,125 కోట్లలో కాపరులు తమ వాటా కింద రూ.1,531.25 కోట్లు (25 శాతం) చెల్లించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. మిగిలిన రూ.4,593.75 కోట్లను రుణంగా ఇవ్వాలని ‘జాతీయ సహకార అభివృద్ధి సంస్థ’(ఎన్సీడీసీ)కి రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య దరఖాస్తు చేసింది. రుణం ఇంకా మంజూరు కాలేదు. ఇవి వస్తేనే కాపరులకు పూర్తిస్థాయిలో పంపిణీ సాధ్యమవుతుంది. ఈ రుణంలో రూ.1000 కోట్లను గొర్రెల అభివృద్ధి పథకం కింద రాయితీగా ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అడిగింది. తమ రాయితీతో సంబంధం లేకుండా రుణం మంజూరుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం ఎన్సీడీసీకి సమాచారమిచ్చింది. మొత్తం సొమ్మును రుణంగా తీసుకుంటేనే జీవాలను కొనడానికి వీలవుతుందని వెల్లడైంది. ప్రస్తుతం పశుసంవర్ధకశాఖ వద్ద రూ.450 కోట్ల నిధులతో రెండో విడత పంపిణీ ప్రారంభించాలని అధికారవర్గాలు యోచిస్తున్నాయి. ఎన్సీడీసీ నుంచి రుణం విడుదలలో జాప్యమై అందరికీ ఇవ్వలేకపోతే కాపరుల నుంచి ఒత్తిడి వస్తుందని ప్రస్తుతానికి పంపిణీ నిలిపివేసినట్లు తెలుస్తోంది.
తొలి విడతకన్నా ధరల పెంపు
ప్రతి ఒక్కరికీ 20 గొర్రెలు, ఒక పోతును కలిపి మొత్తం 21 జీవాలను ఒక యూనిట్‌గా రూ.1.25 లక్షలకు పంపిణీ చేయాలని 2017లో తొలి విడత పంపిణీ సందర్భంగా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఇప్పటివరకూ 81.60 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు పశుసంవర్థకశాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఇతర రాష్ట్రాల్లో గొర్రెల ధరలు పెరిగినందున యూనిట్ ధరను 1.75 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో లబ్ధిదారుడి వాటా రూ.31 వేల నుంచి రూ.43,750కి పెరిగింది. ఈ సొమ్ము కట్టడానికి సిద్ధంగా ఉన్నా గొర్రెలను పంపిణీ చేయడం లేదని ‘రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం’ అధ్యక్షుడు ఉడుతా రవీందర్ ఆరోపించారు.
పాలకవర్గం లేక ఎన్సీడీసీలో జాప్యం
కరోనా కారణంగా గొర్రెల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశాం. ఎన్సీడీసీలో కొత్త పాలకవర్గం నియామకం వల్ల రుణం మంజూరులో జాప్యం జరిగింది. త్వరలో ఈ అప్పు వస్తుందని అంచనా. కేంద్రం రాయితీ ఇవ్వనని తెలపడంతో అవసరమైన నిధులు రుణంగా తీసుకోవాలని నిర్ణయించాం. పథకం ఆగదు. ప్రస్తుతం మావద్ద ఉన్న నిధులతో త్వరలో పంపిణీ ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం.
- డాక్టర్ రాంచందర్, మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివ్దృద్ధి సమాఖ్య
ఇదీ చదవండి: