Ugadi celebrations in Telangana: తెలుగు ప్రజల నూతన సంవత్సరం శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉగాది పర్వదినం వేళ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల ఆర్జితపూజలు, ఆరాధనల కోసం ఉదయం నుంచే బారులు తీరారు. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు స్వయంభు పంచనరసింహ స్వామివారిని మేల్కొలిపి నిత్య కైంకర్యాలను చేశారు. అనంతరం నిజాభిషేకం, తులసి అర్చన, స్వర్ణ పుష్పార్చన జరిపారు.
భద్రాద్రి రామయ్యసన్నిధిలో లక్ష్మణ సమేత సీతారాములకు ఆలయ అర్చకులు విశేషాభిషేకం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఉత్సవాల్లో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. రామయ్య తండ్రి , సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామిల ఆదాయ వ్యయాలు తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని పలు దేవాలయాలలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయం, హనుమాన్ దేవాలయలలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వేద పండితులతో పంచాంగ శ్రవణం చెప్పించారు. ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మున్సిపల్ చైర్మన్ ఆకాంక్షించారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయాలకు వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణమఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న హాజరయ్యారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడితో పాటు గుడాలను అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు పంచాంగం ఆవిష్కరించారు. శోభకృత్ నామ సంవత్సరంలో రైతులందరికి మంచి పంటలు పండాలని, ప్రజలందరికి విజయాలు చేకూరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఉగాది వేడుకలను ఊరంతా కలిసి కనుల పండుగగా నిర్వహించుకున్నారు. పిల్లాపాపలతో కుటుంబ సభ్యులు కలిసి వచ్చి డప్పు చప్పుళ్ళ మధ్య గోదావరి జలాలను ఊరేగించారు. గ్రామంలో ఉన్న 100కు పైగా దేవాలయాలను గోదావరి జలాలతో శుద్ధి చేస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ శివారులో చివరన ఉన్న శ్రీ ప్రహల్లాద లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఇంటిల్లిపాది ఈ దసరా గుట్ట వద్దకు వచ్చి ఇక్కడే భోజనాలు చేసి రోజంతా గడుపుతామని, వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లను సైతం వెంట తీసుకెళ్లి స్వామి వారి ముందు ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చదవండి: