Bjp Ugadi Celebrations: శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు భాజపా రాష్ట్ర కార్యాలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. పర్వదినం సందర్భంగా మహేశ్వర శర్మ ఉగాది పంచాంగం శ్రవణం వినిపించారు. రాష్ట్రంలో దేశంలోనూ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో శోభిల్లాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేస్తే విజయం సాధిస్తామన్నారు.
ప్రకృతి ఆరాధించే భారతదేశంలో జీవితంలో కష్టసుఖాలు వచ్చినా ముందుకు వెళ్లాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆత్మనిర్భర భారత్ పేరుతో అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టడమే కాకుండా ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత భారత్‌కే దక్కిందని సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణను శక్తివంతంగా తయారు చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. భాజపా చేసే ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో ప్రజలంతా కలిసి రావాలని కోరారు. ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక'