ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయనేది దేశంలోని చాలామందిలో నెలకొన్న బలమైన అభిప్రాయం. దాదాపు అన్ని పార్టీల నుంచి నేరచరిత్ర కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎన్నికల అఫిడవిట్లలో ఎంతో మంది నేతలు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడిస్తున్నారు. అయితే ఓటర్లకు కూడా మరో గత్యంతరం లేక వారినే ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
పార్టీల పాపమే ఎక్కువ..
నేరమయ రాజకీయాలు పెరగడంలో పార్టీల పాపమే ఎక్కువ అని చెప్పాలి. సమాజంలో పేరున్న వారిని...ప్రజాసేవ చేసే వారిని కాదని కేవలం గెలుపు గుర్రాల పేరిట ధనబలం ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నాయి. ఎమ్మెల్యేగా టికెట్ దక్కాలంటే ఎంత ఖర్చు పెట్టగలడు అన్న విషయానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. పరోక్షంగా ఓట్లు కొనగలిగే వారికే టికెట్ ఇస్తూ సాధారణ వ్యక్తులను ఖాతరు చేయడం లేదు.
జవాబుదారీ..
ఎప్పుడైతే ఓట్లు కొంటారో... ఎప్పుడైతే వ్యక్తులు డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వస్తారో వారు తాము పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదించేందుకే ప్రయత్నిస్తారు. ఈక్రమంలోనే వారు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది వ్యవస్థాగత లోపంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ బలంగా ఉండాలంటే రాజకీయ పార్టీలను నియంత్రించాల్సిన అవసరం ఉందంటున్నారు చాలామంది. ఈ అంశాన్ని పార్టీల అంతరంగిక వ్యవహారంగా భావించకుండా..ప్రజలకు, న్యాయస్థానాలకు, ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఉండేలా చేయాలని కోరుతున్నారు
పెరిగిపోతున్న నేరగాళ్ల సంఖ్య..
చట్టసభల్లో పెరిగిపోతున్న నేరగాళ్ల సంఖ్యపై అత్యున్నత న్యాయస్థానం మొదలు కేంద్ర ఎన్నికల సంఘం వరకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయాలను సంస్కరించడం కోసం కంకణం కట్టుకున్నాయి. పౌరసంఘాల సాయంతో నేరగ్రస్త రాజకీయాలు మార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగానే ప్రతి అభ్యర్థి తమ ఆస్తుల వివరాలతో పాటు... తమపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా అనే విషయాన్ని కూడా వెల్లడించాలనే నిబంధనలు తీసుకువచ్చారు.
అప్పీలుకు వెళ్లి యథావిధిగా..
అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రత్యేక హక్కులు, భద్రత అనేది ప్రజా ప్రతినిధులకు రక్షక కవచంగా మారిపోయింది. ఏదైనా నేరం రుజువై శిక్ష పడినా వారు పై కోర్టుకు అప్పీలుకు వెళ్లి యథావిధిగా కొనసాగుతున్నారు. అధికార పీఠమెక్కి ప్రజల్ని దోచుకుంటున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే... జైలులో ఉన్న వ్యక్తికి ఓటు వేసే హక్కు లేదు... కానీ అదే వ్యక్తి ఎన్నికల్లో మాత్రం పోటీ చేయొచ్చు. ఒకవేళ గెలిస్తే... ప్రజాప్రతినిధిగా దర్జాగా చట్ట సభల్లోకి వెళ్లవచ్చు. ఇలా ఎంతో మంది పార్లమెంట్‌కు, రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
కీలక ఆదేశాలు..
ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయాల్లో నేరచరితులకు సంబంధించి కీలక ఆదేశాలను ఇచ్చింది సుప్రీం కోర్టు. ప్రాంతీయ, జాతీయ పార్టీలు అన్నీ తమ తమ అభ్యర్ధులపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలను ప్రచారంలోకి తీసుకురావాలని ఆదేశించడం గొప్ప ముందడుగే. . అధికారిక వెబ్‌సైట్లలో సామాజిక మాధ్యమాల్లో వివరాలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. 2018లో నూ అదే విషయం చెప్పినా వాటిని అభ్యర్థులు కానీ, రాజకీయ పక్షాలు కానీ పాటించడం లేదని, కోర్టు ధిక్కరణగా భావించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
పార్టీల వివరణ..
క్రిమినల్ కేసులున్న వారు అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారో రాజకీయ పార్టీలు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేరచరిత్ర లేని వారికి ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో కూడా పార్టీలు చెప్పా ల్సి ఉంటుంది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోనే లేదా నామినేషన్లు ప్రారంభమయ్యే తేదీకి కనీసం 2వారాలు ముందైనా ఈ వివరాలన్నీ వెల్లడించాలి. ఒకవేళ నేరచరితుడు ఎన్నికైన పక్షంలో ఈ వివరాలు 72 గంటల్లోగా ఎన్నికలసంఘానికి వివరించాలి. అభ్యర్థి తన అఫిడవిట్‌లో ఎలాగూ తనపై ఉన్న కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఆ అఫిడవిట్‌ను ఎన్నికల కమిషన్ తన పోర్టల్‌లో ఉంచుతుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా పార్టీకి సంబంధించిన అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ సమాచారాన్ని ఉంచాలి.
కేసులు పెండింగ్‌లో ఉంటే..
క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉంటే ఎవరైనా ఒక అభ్యర్థిని ఎంపిక చేసినపుడు వారి విజయావకాశాల ఆధారంగానే కాక వారి విద్యార్హతలు, సాధించిన విజయాలు, ప్రతిభాపాటవాలు కూడా టిక్కెట్ల కేటాయింపులో ప్రస్తావించాల్సి ఉంటుంది. ఒకవేళ రాజకీయ పార్టీలు ఈ మార్గ దర్శకాలు ఉల్లంఘిస్తే దానిని కోర్టుధిక్కరణగా భావించి సుప్రీంకోర్టు దృష్టికి ఎన్నికల కమిషన్ తీసుకురావాలని, అదే సమయంలో ఆయా పార్టీలపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని కూడా ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం.
కొత్త మార్గదర్శకాలు..
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తన నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసిన ఎన్నికల సంఘం ఇటీవలే కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అభ్యర్థుల నేరచరిత్రను .. పార్టీలు, అభ్యర్థులు తప్పనిసరిగా ప్రచారం చేయాల్సిందేనని ఆదేశించింది. పార్టీల వెబ్‌సైట్లలో నూ అభ్యర్థులపై దాఖలైన కేసులు ఇతర వివరాలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ ప్రచారం వల్ల ప్రజలకు.. అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది.
నేరస్వామ్యానికి చెక్..
ఎన్నికల్లో ఏ వ్యక్తినైనా ఎన్నుకోవడం అనే ప్రక్రియ కేవలం తన గొప్పలక్షణాల ఆధారంగానే జరగాలని.. ఫలానా వ్యక్తైతేనే గెలుస్తాడనే ధోరణితో జరగరాదని ఈసీ వ్యాఖ్యానించింది. పోటీ చేసే అభ్యర్థి నేరచరిత్ర ఓటర్లకు తెలవాలని.. వారికి ఓటేయాలో వద్దో ఓటర్లే నిర్ణయించుకుంటారని చెప్పింది. 2018లోనే ఈసీ.. అన్ని పార్టీలకు ఈ విషయంపై దిశానిర్దేశం చేసింది. ఎన్నికల ప్రక్షాళనకు కాలక్రమంలో ఎన్నో చర్యలు చేపట్టినా, రాజకీయ పక్షాలు ముందుకు రానంతకాలం ఇది సాధ్యం కాదనేది స్పష్టంగా తెలుస్తోంది. వేళ్లూనుకున్న రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి నేర చరిత్ర లేని వారికే టిక్కెట్లు ఇస్తామని చెప్పే ధైర్యం ఉన్నప్పుడే నేరస్వామ్యానికి చెక్ పెట్టినట్టు.
ఇదీ చూడండి: నియంత్రణ రేఖ వెంబడి భారీగా భద్రత బలగాల మోహరింపు