తిరుమలేశుని దర్శనార్థం వచ్చే వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో... వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లలో తితిదే అన్నప్రసాద వితరణ చేస్తోంది. అయితే అన్నప్రసాద భవనాలకు వెళ్లలేని వారు హోటళ్లను ఆశ్రయిస్తుంటారు. అక్కడ అధిక ధరలతో పాటు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని రెండేళ్ల కింద హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా అప్పటి ఈవో... న్యాయస్థానం ముందు హాజరయ్యారు. పర్యవసానంగా.. తిరుమలలో 8 హోటళ్లను మూసివేయడమే కాక రాంబగీచా, కేంద్రీయ విచారణ కార్యాలయం, యాత్రిక సదన్, హెచ్వీసీ, అంజనాద్రి నగర్ కాటేజీల వద్ద ప్రత్యేక అన్నప్రసాద వితరణ కేంద్రాలను తితిదే ఏర్పాటు చేసింది. ఇక్కడ రోజంతా సమయాన్ని బట్టి... టీ, కాఫీ, మజ్జిగ, అల్పాహారం, భోజనాన్ని భక్తులకు అందిస్తోంది.
ప్రస్తుతం ఈ కేంద్రాల నిర్వహణ భారంగా ఉందన్న విషయాన్ని శ్రీవెంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు... దేవస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వీటి నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించిన తితిదే... రెండేళ్ల కాలానికి ఈ-టెండర్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. అన్నప్రసాద వితరణ బాధ్యతను ప్రైవేట్ పరం చేస్తే ఆహారంలో నాణ్యత తగ్గిపోతుందనే భావన భక్తుల్లో వ్యక్తమవుతోంది. ఇన్నేళ్లుగా తితిదే ఆధ్వర్యంలోనే నడిచిన అన్నప్రసాద వితరణ... త్వరలోనే ప్రైవేటు పరం కానుంది.