తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను తిరస్కరించలేదని తితిదే(TTD) ఓ ప్రకటన విడుదల చేసింది. లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు దర్శనంలో గతంలో ఏ విధానం అమలు జరిగేదో ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండటం, ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల నుంచి కోటాకు మించి వచ్చిన లేఖలను తిరస్కరించామని వివరించింది.
కొందరు నాయకులు ఫోన్ చేసి తమకు ముఖ్యమైన వారని చెప్పడంతో... ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మంజూరు చేసి స్వామివారి దర్శనం కల్పించామని పేర్కొంది. గదుల కేటాయింపునకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపింది.
భక్తులను మోసగించిన 27మంది అరెస్టు
తిరుమలలో భక్తులను మోసగించిన 27 మంది దళారులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో నకిలీ టికెట్లతో మోసం చేస్తున్నారని అన్నారు. వీఐపీ టికెట్లను అధిక ధరలకు విక్రయించిన ఇద్దరు దళారులపై కేసు నమోదు చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: గోల్కొండ తల్లికి తొలి బోనం.. భాగ్యనగరమంతా కోలాహలం