TSRTC BUSES: సంక్రాంతికి మూడు, నాలుగు రోజుల ముందు నుంచి కిటకిటలాడిన రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు... రెండ్రోజుల్లో మళ్లీ సందడిగా మారనున్నాయి. పండగకు ఇంటికి వెళ్లి... తిరిగి వచ్చే వాళ్ల కోసం 110రైళ్లు... 225ట్రిప్పులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం అవసరమైతే మరిన్ని రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
అంతే సంఖ్యలో...
శబరిమలై నుంచి వచ్చే భక్తులకూ రైళ్లు కేటాయించినట్లు అధికారులు వివరించారు. సొంతూళ్లకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ 3వేల 398 బస్సులు నడిపించింది. ఆంధ్రప్రదేశ్‌కి 1,000 బస్సులు, మిగిలిన బస్సులను... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తిప్పింది. స్వస్థలాల నుంచి తిరిగి వచ్చే వారి కోసం ఆయా జిల్లాల నుంచి అంతే సంఖ్యలో బస్సులను నడుపుతామని అధికారులు వెల్లడించారు.
అదనపు ఛార్జీలు...
తొలిసారిగా పండగవేళ ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయకుండా బస్సులను నడిపింది. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పండగవేళ సుమారు 20 లక్షల మందిని ఆర్టీసీ సొంతూళ్లకు చేరవేసింది. వీటితో పాటు నిత్యం సాధారణంగా తిరిగే 4వేల316 బస్సుల ద్వారా మరో లక్షా 50వేల మందిని గమ్యస్థానాలకు చేర్చింది.
22 లక్షలకు పైచిలుకు...
మొత్తంగా ఈ సంక్రాంతి సీజన్‌లో సుమారు 22 లక్షల పైచిలుకు ప్రయాణికులను సొంతూళ్లకు చేరవేసినట్లు ఆర్టీసీ చెబుతోంది. సొంతూళ్ల నుంచి తిరిగి వచ్చే ప్రయాణికులు ప్రజా రవాణాను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: Hyderabad Roads: పల్లెకెళ్లిన పట్నం.. బోసిపోయిన భాగ్యనగరం