TSRTC Meeting on Compassionate appointments: ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల నుంచి సుమారు.. 1,200 మందికి ఉద్యోగాలిస్తామని తెలిపారు. ఈ అంశంపై వారంలో కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని బాజిరెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి బస్‌భవన్‌లో సమావేశమైన ఆర్టీసీ పాలకవర్గం.. 300 అంశాలపై విస్తృత చర్చ చేసింది. ప్రధానంగా ఛార్జీల పెంపుపైనా సమాలోచనలు చేసినట్లు తెలిసింది.
త్వరలో 1,060 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్న బాజిరెడ్డి.. సంస్థ నష్టాల నుంచి గట్టెక్కించే ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీకి నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా జిల్లాల్లోనూ ప్రవేశపెడతామని సజ్జనార్ తెలిపారు.
"ప్రతి ప్రయాణికుడిపై రూపాయి సెస్, డీజిల్ సెస్, టోల్ ప్లాజాల వద్ద సెస్‌పై ఎలాంటి వ్యతిరేకత లేకపోవడంతో బోర్డు అనుమతి ఇచ్చింది. సెస్‌ల ద్వారా ఆర్టీసీకి రూ. 20 నుంచి 30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంతాల కోసం ఏసీ, నాన్ ఏసీ, స్లీపర్ కోచ్ బస్సులు తీసుకురావాలని యోచిస్తున్నాం." -బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఛైర్మన్
"డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీకి నష్టం వాటిల్లింది. దీంతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని చూస్తున్నాం. అమల్లోకి వస్తే మొదట ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో చేపడతాం. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను పాలక మండలి ఆమోదించింది. ఫార్మాను విస్తరించడం, ట్రాఫిక్ పైన కాకుండా ఇతరత్రా ఆదాయ వనరులపై దృష్టి సారించాం." -సజ్జనార్, ఆర్టీసీ ఎండీ
ఇవీ చదవండి: ప్రేమోన్మాది అజార్‌ను రహస్యంగా కోర్టులో హాజరుపర్చిన పోలీసులు