TSRTC Launches Sleeper Buses: టీఎస్‌ఆర్టీసీలో స్లీపర్ బస్సులను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్-విజయవాడ మార్గాల్లో ఈ స్లీపర్ బస్సులు నడవనున్నాయి. 33 సీట్ల సామర్థ్యంతో సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతి బెర్త్ వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతోపాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సులోనూ వైఫై సదుపాయం కల్పించారు. ఈ బస్సుల్లో ప్రయాణించేవారికి ఒక వాటర్ బాటిల్‌తో పాటు ఫ్రెష్‌నర్‌ను ఉచితంగా అందజేస్తారు. లగేజీ లోడింగ్, అన్‌లోడింగ్‌కు అటెండెంట్లు సహకరిస్తారని అధికారులు తెలిపారు.
బస్సుల వేళలు ఇలా..
* కాకినాడ వైపు వెళ్లే బస్సులు హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు బయలుదేరుతాయి. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు రాత్రి 7.15 గంటలకు, 7.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి.
* విజయవాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ మియాపూర్ నుంంచి ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి.
కొద్దిరోజుల క్రితమే 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు: కొద్దిరోజుల క్రితమే 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్సులకు సాంకేతికతను జోడించారు. 36 రిక్లైనింగ్ సీట్ల సామర్థ్యం కల ప్రతి బస్సులో సెల్‌ఫోన్ ఛార్జింగ్, టీవీ సదుపాయంతో పాటు బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా ట్రాకింగ్ వ్యవస్థను పొందుపరిచారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అత్యవసర సందర్భాన్ని తెలియజేయడానికి బస్సులో పానిక్ బటన్ కూడా అమర్చారు. దీన్ని ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ప్రయాణికులు ఆ బటన్‌ను నొక్కగానే కంట్రోల్ రూమ్ అధికారులు అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకుంటారు.
ఇవీ చదవండి: 'ప్రైవేట్ వాహనాలకు దీటుగా మరిన్ని ఆర్టీసీ బస్సులు'
సాగర్ తీరాన మళ్లీ రయ్.. రయ్.. వచ్చే నెలలోనే ఈ-రేసింగ్ పోటీలు