లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ బస్సులు కేవలం డిపోలకే పరిమితం కావడంతో తిరిగి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. కొన్ని నెలలు సగం జీతమే ఇచ్చిన యాజమాన్యం..ఇటీవలి కాలంలో పూర్తిస్థాయి వేతనం అందజేస్తుంది. అయితే.. వచ్చే ఆదాయానికి అయ్యే ఖర్చులకు వ్యత్యాసం భారీగా ఉండడంతో ఆర్థిక కష్టాలు ఆర్టీసీని వెంటాడుతున్నాయి.
పదోతేదీ వరకు అందని జీతాలు
గతంలో ఒకటో తేదీన జీతాలు వచ్చేవి... ఆర్థిక ఇబ్బందులతో రెండు, మూడో తేదీలకు ఆ తర్వాత ఏడో తేదీ వరకు వెళ్లాయి. సంస్థ ఏర్పడ్డ తర్వాత ...10వ తేదీ వరకు కూడా ఆర్టీసీకి జీతాలు ఇవ్వకపోవడం ఇదే ప్రథమమని కార్మిక నేతలు అభిప్రాయపడుతున్నారు.
కరోనా కాలంలో కూడా ఆసుపత్రి సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది కోసం ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. ఇప్పుడు కూడా జిల్లాలకు, గ్రేటర్లో ఆర్టీసీ బస్సులను తిప్పుతుంది. ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి ఇప్పటికీ జీతాలు ఇవ్వకపోవడం విచారకరమని కార్మికనేతలు పేర్కొంటున్నారు.
ముందస్తు ఆలోచన లేకే...
ప్రతిరోజూ కష్టపడి చెమటోడ్చే కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు నిత్యం ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతుంటారని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు పేర్కొన్నారు. ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం యాజమాన్యం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇది ఇలాగే కొనసాగితే...ఆర్టీసీలో జీతానికి కూడా గ్యారంటీ లేదనే భావన కార్మికుల్లో వ్యక్తమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే.. కార్మికుల్లో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
- ఇవీ చూడండి: 'ప్రపంచానికి ఔషధ కర్మాగారంలా భారత్'