ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సంఘం ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారిపోయింది. 1952లో ఉమ్మడి రాష్ట్రంలో 1.20లక్షల ఆర్టీసీ కార్మికులు... పొదుపు సంఘంలో సభ్యులుగా ఉండి సీసీఎస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 52వేల మంది కార్మికులు అందులో పొదుపు చేస్తూ వచ్చారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలుగా విడిపోయింది. టీఎస్ఆర్టీసీలో 2020 నాటికి కొంతమంది కార్మికులు పదవీవిరమణ పొందడంతో ఆ సంఖ్య 48వేల మందికి తగ్గిపోయింది.
రూపాయి.. రూపాయి కూడబెట్టి
సీసీఎస్ వద్ద 1500ల కోట్ల నిధులు ఉన్నాయి. ఆ నిధుల నుంచి ఉద్యోగులకు రుణాలు, మృతి చెందిన వారికి ఆర్థిక సాయం, ఉద్యోగుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌ల వంటివి అందిస్తున్నారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతినెలా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల మూల వేతనాల నుంచి 7 శాతం మినహాయించి 40 కోట్లను సీసీఎస్‌కు చెల్లిస్తుంది.
రెండేళ్లుగా సీసీఎస్ చెల్లించడం లేదు
ఆర్టీసీ యాజమాన్యం గత రెండేళ్లుగా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించుకున్న డబ్బులను సీసీఎస్‌కు కట్టడం నిలిపివేసింది. దీనివల్ల యాజమాన్యం.. సీసీఎస్‌కు 632 కోట్ల అసలు, దానిపై 102 కోట్ల వడ్డీ బాకీ ఉంది. కార్మికులు, ఉద్యోగులు తమ అవసరాల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి రోజూ డబ్బుల కోసం అధికారులను బతిమిలాడుకుంటున్నారు.
లోను కోసం భారీగా దరఖాస్తులు
సీసీఎస్‌లో సుమారు 48వేల ఉద్యోగులు ఉండగా... అందులో 12వేల మంది ఉద్యోగులు లోను కోసం దరఖాస్తు చేసుకున్నారని సీసీఎస్ కార్యదర్శి మహేశ్ పేర్కొన్నారు. తమ వద్ద అతి తక్కువ డబ్బులు ఉన్నాయన్నారు. యాజమాన్యం చెల్లించాల్సిన నిధులు సకాలంలో ఇవ్వకపోవడంతో సమస్యలు వస్తున్నాయని వివరించారు.
దయనీయంగా మారిన కార్మికుల పరిస్థితి
పదవీవిరమణ పొందిన వారు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలు, అవసరానికి డబ్బులు దాచుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం ఆలోచించి... తమ నిధులు చెల్లించాలని ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ రజతోత్సవ వేళ.. తారల శుభాకాంక్షల వెల్లువ