TSPSC Paper Leak Case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రోజుకో కొత్త వ్యవహారం బయటకు వస్తోంది. సోమవారం సిట్ అధికారులు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రవీణ్ ఫోన్ కాల్ డేటా, బ్యాంకు ఖాతాలను పరిశీలించగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు గ్రూప్-1, ఏఈ, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ప్రశ్నపత్రాలు మాత్రమే విక్రయించారని భావించారు. కానీ విచారణలో మరో పరీక్ష ప్రశ్నపత్రం కూడా విక్రయించినట్లు తేలింది. ప్రస్తుతం ఏఈఈ ప్రశ్నపత్రం కూడా బహిర్గతమైనట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
AEE paper leak in Telangana : మరోవైపు ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిన్న నగర సిట్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 24కు, అరెస్టులు 23కు చేరాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన మురళీధర్‌రెడ్డి, వరంగల్ నివాసి మనోజ్ స్నేహితులు. వీరికి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్‌కుమార్ (ప్రధాన నిందితుడు)తో పరిచయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) ప్రశ్నపత్రాన్ని ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలిచ్చి అతని వద్ద కొనుగోలు చేశారు. పోలీసులు ప్రవీణ్‌ను రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని విచారించినా నోరు మెదపలేదు. తాజాగా అతని ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. తాజాగా అరెస్టయిన మురళీధర్‌రెడ్డి, మనోజ్ కలిసి ఏడుగురు అభ్యర్థులకు ఈ ప్రశ్నపత్రాలు విక్రయించినట్లు గుర్తించారు. సిట్ పోలీసులు వారి వివరాలు రాబడుతున్నారు. ఈ కేసు దాదాపు ముగింపు దశకు వచ్చినట్లుగానే అంచనాకు వస్తున్నారు.
TSPSC Paper Leakage Case Update : ఈ కేసులో ఇప్పటివరకు నిందితులకు రూ.33.4 లక్షలు ముట్టినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు సిట్ అధికారులు కొద్ది రోజుల క్రితం తెలిపారు. అయితే కొందరు నిందితులు నగదు తీసుకోగా.. మరికొందరు బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించుకున్నట్లు తేలిందని చెప్పారు. ఇందులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్‌కు రూ.16 లక్షలు మేర ముట్టినట్లు వెల్లడైంది. ఏఈ సివిల్ ప్రశ్నపత్రాన్ని నిందితుడు.. గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుకా రాథోడ్, ఆమె భర్త డాక్యాకు ఇచ్చేందుకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. రేణుక తన సోదరుడు కేతావత్ రాజేశ్వర్ కోసం ఆ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసింది. తర్వాత కేతావత్ రాజేశ్వర్, డాక్యాలు ఆ పేపర్ని అయిదుగురికిగానూ రూ.10 లక్షల చొప్పున విక్రయానికి బేరం పెట్టారు. కానీ అనుకున్నంతలో మొత్తంలో అందరూ ఇవ్వలేదు.
ఇవీ చదవండి: