TSPSC Paper Leakage Issue Update : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి వ్యవహారంలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకరలక్ష్మీ... డైరీ నుంచి పాస్‌వర్డ్ కొట్టేసి గతేడాది అక్టోబర్ 1న ఆమె కంప్యూటర్‌లోని ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసినట్లు రాజశేఖర్‌రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నాపత్రాలను... ప్రవీణ్‌కుమార్ పెన్‌డ్రైవ్‌లోకి మార్చినట్లు తెలుస్తోంది.
ప్రవీణ్ ఇంట్లో రూ.5లక్షలు స్వాధీనం : మరోవైపు... బడంగ్‌పేటలోని ప్రవీణ్‌కుమార్ నివాసంలో తనిఖీ చేసిన సిట్ పోలీసులు 5లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రెండోసారి కస్టడీలోకి తీసుకున్న ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్, రాజేందర్‌ను... నిన్న సుదీర్ఘంగా విచారించారు. డాక్యానాయక్, రాజేందర్‌ను ఉదయం మహబూబ్‌నగర్ జిల్లాలోని సొంతూరు తీసుకెళ్లారు. ఆ ఇద్దరూ అక్కడ మంతనాలు జరిపిన కొందరు వ్యక్తుల నుంచి... సిట్ పోలీసులు వివరాలు సేకరించినట్టు సమాచారం. నిందితుల నుంచి సేకరించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా అనుమానితుల జాబితా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిలో ఇప్పటివరకూ....ఆరుగురిని గుర్తించి ప్రశ్నించారు.
60మందిని విచారణ చేసిన అధికారులు : మరో ముగ్గురి సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆ ముగ్గురు... అజ్ఞాతంలోకి వెళ్లినట్టు అంచనాకు వచ్చారు. వారికి ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధంపై ఆరా తీస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100పైగా మార్కులు సాధించిన 121 మంది యువతీయువకుల్లో.... ఇప్పటివరకూ 60మందిని విచారణ చేశారు. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌కు సిట్ పోలీసులు... లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా సల్కర్‌పేటలో తిరుపతయ్య ఇంటికి వెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అతని కుటుంబసభ్యులను ప్రశ్నించారు. గండీడ్ ఎంపీడీవో కార్యాలయానికి కూడా వెళ్లి సిట్ పోలీసులు వివరాలు సేకరించారు.
15కు చేరిన అరెస్టులు : తిరుపతయ్యను నిన్న అరెస్ట్ చేయగా... ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయినవారి సంఖ్య 15కు చేరింది. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు. ఒకే మండలం, ఒకే విభాగంలో పనిచేస్తున్న డాక్యానాయక్‌తో అతనికి పాత పరిచయాలు ఉన్నాయి. తన వద్ద ఏఈ ప్రశ్నపత్రం ఉందని తిరుపతయ్యకు... డాక్యానాయక్ చెప్పాడు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఫరూక్‌నగర్ మండలం నేరెళ్లపల్లికి చెందిన రాజేందర్ కుమార్‌తో 10లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని 5లక్షలు తీసుకొని ప్రశ్నపత్రం చేతికిచ్చేందుకు తిరుపతయ్య దళారిగా వ్యవహరించినట్లు నిర్థారణ కావడంతో అతన్ని అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: