ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలు డిజిటల్ విద్యకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. కొవిడ్ 19 విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించే లక్ష్యంతో హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్ సీనియర్ మహిళా ఉద్యోగి బహుకరించిన నాలుగు టీవీలను (టీఎస్ యూటీఎఫ్) కమిటీ ద్వారా నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు అందజేశారు. హైదరాబాద్ దోమలగూడలోని యుటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా చిట్కుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వికారాబాద్ జిల్లా బంట్వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బోరబండ సాయిబాబా నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ హనుమాన్ స్టోన్ కట్టర్స్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ కమిటీ టీవీలను అందచేసింది.
ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయని సందర్భంలో పలువురు దాతలు స్పందించి సహాయం చేయటం సంతోషకరమని చావ రవి అన్నారు. తమ పేరును వెల్లడించటం ఇష్టం లేని దాత.. తాను చేసిన సహాయం రాష్ట్ర యూటీఎఫ్ ద్వారానే సద్వినియోగం అవుతుందని నమ్మకంతో అందజేశారని పేర్కొన్నారు. ఆ ఉద్యోగి నమ్మకాన్ని నిలబెట్టే విధంగానే అవసరమైన పాఠశాలలను ఎంపిక చేసి టీవీలను అందజేశామని వివరించారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ పత్రిక ప్రధాన సంపాదకులు పి. మాణిక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : 'పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుంది'