TS RTC and MMTS Services Issues : విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా ప్రజారవాణాను అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో అడుగులు పడడం లేదు. ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గిపోవడం, ఎంఎంటీఎస్ సర్వీసుల విస్తరణ లేక నగరవాసులు వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. వాయు కాలుష్యం పెరుగుతోంది. వాయు నాణ్యత గణనీయంగా తగ్గిపోవడానికి పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఎంత కారణమో.. ప్రజారవాణా వ్యవస్థను పటిష్ఠం చేయడంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిర్లక్ష్యానిదీ అంతే పాత్ర. నిర్మాణరంగ కార్యకలాపాలు, పారిశ్రామిక కాలుష్యంతోనూ వాయు నాణ్యత దెబ్బతింటోంది. గాల్లో ప్రమాదకరమైన పీఎం 10 ధూళికణాల స్థాయి మోతాదు మించుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణమండలి నివేదిక ప్రకారం.. దక్షిణాదిలో వాహనాల వల్లే 50శాతం కాలుష్యం ఉత్పన్నమవుతున్నట్లు వెల్లడైంది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో గాలి నాణ్యత తగ్గి శ్వాసకోశ సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజారవాణాను పటిష్ఠం చేయడమే మార్గమని సూచిస్తున్నారు. నగరంలో కాలుష్య కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే..

కారణం-1:
15 ఏళ్లు మించిన వాహనాలు
గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు మించిన వాహనాలు 3లక్షల వరకు ఉన్నాయి. కాలుష్యం అధికమవ్వడానికి కాలం చెల్లిన వాహనాల్ని వినియోగించడం ఒక ప్రధాన కారణమని పీసీబీ అధికారులు చెబుతున్నారు. సాధారణ వాహనంతో పోల్చితే.. 15ఏళ్లకుపైగా వినియోగించిన వాటి నుంచి దాదాపు 15-20శాతం వరకు అధికంగా కాలుష్యం వెలువడుతుంది. గాల్లో కార్బన్‌మోనాక్సైడ్, సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రోజన్‌ఆక్సైడ్ వంటి ఉద్గారాల తీవ్రత పెరుగుతుంది.
కారణం-2:
లెక్క తప్పిన బస్సులు
జనాభా కోటి దాటింది. నగరవాసుల ప్రయాణాలకు వీలుగా ఆర్టీసీ 7,500 వేల వరకు బస్సుల్ని తిప్పాల్సి ఉండగా.. ప్రస్తుతం 2,850 ఉన్నాయి.
కారణం-3:
పరుగందుకోని ఎంఎంటీఎస్
నగర జనాభాకు దాదాపు 250 వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు అవసరం. గతంలో 121 సర్వీసులుండగా.. రోజూ సగటున 1.80లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం వాటిని 71కి పరిమితం చేయడంతో ప్రయాణికుల సంఖ్య 70 వేలకు తగ్గింది. దాదాపు 1.10 లక్షల మంది సొంత వాహనాల్ని ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు ఎంఎంటీఎస్ సర్వీసుల్ని ఆకస్మికంగా రద్దు చేస్తున్నారు. దీంతో చాలామంది వ్యక్తిగత వాహనాల్లో వెళ్తున్నారు.
కారణం-4:
మెట్రో విస్తరిస్తే మరింత మేలు
మెట్రో సర్వీసుల్ని అర్ధరాత్రి వరకూ నడపాలి. సేవల్ని విస్తరిస్తే ప్రయోజనం ఉంటుంది. బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్, గచ్చిబౌలి- శంషాబాద్ విమానాశ్రయం, నాగోల్-ఎల్‌బీనగర్ ప్రాంతాలకు విస్తరిస్తే వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత తగ్గే అవకాశం ఉంది.
వాయుకాలుష్యం అధికమైతే వచ్చే ఆరోగ్య సమస్యలు
ఆస్తమా, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, మధుమేహం, మానసిక వైకల్యం, ఊపిరితిత్తుల క్యాన్సర్, మెదడుకు ఆక్సిజన్ తగ్గి హఠాన్మరణం

ఇదీ చదవండి: Potato cultivation : ఆలుగడ్డల సాగుకు తెలంగాణ అనుకూలం