Jubilee hills case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు... ఐదుగురు మైనర్ నిందితులను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరనున్నారు. ఈ మేరకు 2015లో జువైనల్ జస్టిస్ యాక్ట్‌కు చేసిన చట్ట సవరణను పోలీసులు ఉదహరిస్తున్నారు. తీవ్ర నేరం చేసే మైనర్లను చట్ట ప్రకారం మేజర్‌గా పరిగణించవచ్చని చెబుతున్నారు.
ఈ కేసులో ఐదుగురు మైనర్లు 16 నుంచి 18ఏళ్ల లోపు వాళ్లున్నారు. వారిలో ఒకరికి 18 ఏళ్ల వయసుకు ఒక నెల మాత్రమే తక్కువగా ఉన్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మైనర్ బాలికను మభ్యపెట్టి, భయాందోళనకు గురిచేసి ఐదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్ కలిసి సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐదుగురు మైనర్లకు... తాము చేస్తున్న తప్పు గురించి తెలిసి కూడా అత్యాచారం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. 16 నుంచి 18 ఏళ్ల వయసున్న మైనర్లు తీవ్ర నేరం చేస్తే చట్టప్రకారం వాళ్లను మేజర్లుగా పరిగణించి... తగిన శిక్ష విధించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. 2015లో ఈ మేరకు జూవైనల్ చట్టానికి సవరణలు చేసిన విషయాన్ని పోలీసులు ప్రస్తావిస్తున్నారు.
చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో 2017లో 10 ఏళ్ల బాలుడిని 17ఏళ్ల మైనర్.. అసహజ లైంగిక దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసులో 17 ఏళ్ల బాలుడిని జువైనల్ కోర్టు మేజర్‌గా పరిగణించి జీవిత ఖైదు విధించిన విషయాన్ని పోలీసులు వివరిస్తున్నారు. ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే నేరాన్ని మైనర్లు చేసినప్పుడు వాటిని తీవ్ర నేరంగా పరిగణించి... మైనర్లకు సైతం కఠిన శిక్షలు వేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఐదురుగు మైనర్లకు సంబంధించి నేరాభియోగపత్రం దాఖలు చేసిన తర్వాత... విచారణ జరిగే సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరనున్నారు. ఈ మేరకు న్యాయ సలహా తీసుకుంటున్నారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు సాదుద్దీన్‌ను ప్రశ్నిస్తున్నారు.
కేటీఆర్ స్పందన.. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించాలన్న పోలీసుల నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. పెద్దల తరహాలో అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు జువైనల్‌గా పరిగణించకుండా.. కచ్చితంగా మేజర్లుగానే శిక్షించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పోలీసుల వైఖరికి పూర్తి మద్దతినిస్తున్నట్లు కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. 'అత్యాచారం నేరానికి పాల్పడేంత పెద్దవారైతే.. ఆ వ్యక్తిని కూడా పెద్దవారిగానే శిక్షించాలి.. యువకుడిగా కాదు' అని ట్విటర్లో పోస్ట్ చేశారు.
end
సంబంధిత కథనాలు..