జనవరి ఒకటో తేదీకి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం అక్టోబరులో నుంచి జనవరి ఆరంభం వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సవరణ ప్రక్రియలో భాగంగా ఓటు హక్కు నమోదు, సవరణలు చేసుకునేందుకు వచ్చే నెల అయిదో తేదీ వరకు తుది గడువును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 28వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికం ఆన్‌లైన్ ద్వారా వచ్చినవే. ఆయా దరఖాస్తుల పరిశీలనను అధికారులు చేపట్టారు. వివిధ అంశాలపై వచ్చిన అభ్యంతరాలను కూడా త్వరితగతిన పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను జనవరి 15వ తేదీన ప్రకటించాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేసింది. ఓటర్ల జాబితా సవరణ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 3,00,06,054 మంది ఓటర్లు ఉన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకటించే నాటికి మరో అయిదారు లక్షల మంది అదనంగా పెరిగే అవకాశం ఉందన్నది అంచనా.
ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణలో భాగంగా వచ్చిన దరఖాస్తులు..
- ఓటు నమోదు కోసం(ఫాం-6) : 2,87,009
- ఓటు హక్కు తొలగింపు కోసం(ఫాం-7) : 87,805
- ఓటర్లజాబితాలో సవరణల కోసం(ఫాం-8) : 28,835
- నియోజకవర్గ మార్పు (ఫాం-8ఎ) : 10,779
- విదేశాల్లో ఉంటున్న భారతీయులు (ఫాం-6ఎ) : 21
'మండలి' నమోదుకు..
త్వరలో ఎన్నికలు జరగనున్న వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు గురువారం చివరి రోజు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఈ గడువు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఉంది.
- ఇదీ చదవండి: పిప్రి ఎత్తిపోతల పనులు చేపట్టండి: సీఎం కేసీఆర్