ఈఎస్ఐ బోర్డు మెంబర్‌గా ఎన్నికైన తెలంగాణ ఆటో ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు, తెలంగాణ కార్మిక విభాగం ఉపాధ్యక్షులు వేముల మారయ్యని హైదరాబాద్ బోయిన్ పల్లి స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ యూనియన్ తరఫున హెచ్ఎంటీ నాచారం టీఆర్ఎస్కేవీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ కొనసాగుతూ పాఠశాలలు తెరుచుకోకపోవడం వల్ల స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధ్యక్షులు గడప నర్సింహులు గంగపుత్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వెహికల్ ట్యాక్స్‌లు కట్టలేమని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వెహికల్ ట్యాక్స్‌లను ఈ నెల చివరి వరకు కట్టని పక్షంలో ఫైన్ వేస్తామని రవాణాశాఖ ప్రకటన విడుదల చేయడం సమంజసం కాదని వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాక్స్‌లు కట్టలేమని, డ్రైవర్లను ఆదుకోవాలని ప్రధాన కార్యదర్శి శంకర్ గంగపుత్ర కోరారు. దీనికి స్పందించిన మారయ్య ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.