ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించకూడదని నిర్ణయించింది. తెరాస ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గులాబీ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న... మరో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల పేరుతోనే ఈ ఎన్నికల్లో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
29 తో ముగియనున్న పదవీకాలం
గతంలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పాతూరి సుధాకర్ రెడ్డి తెరాస అభ్యర్థిగా గెలుపొందారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం నుంచి తెరాసపై స్వతంత్ర అభ్యర్థిగా పూల రవీందర్ విజయం సాధించినప్పటికీ...తర్వాత ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరిద్దరి పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది.
చివరికి చేరేది గులాబీ గూటికేనా..?
పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్‌ను అభ్యర్థులుగా ప్రకటించాలని తెరాస ముందుగా భావించింది. ఈ ఎన్నికల్లో ఉద్యోగులకు వేతన సవరణ, ఉపాధ్యాయుల సమస్యలు ప్రధానంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున... తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ తమ అభ్యర్థి ఓడిపోతే పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్లో భిన్నమైన సంకేతాలు వెళ్తాయని తెరాస నేతలు భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎవరుగెలిచినా గులాబీ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఒక్కోనియోజకవర్గం నుంచి సుమారు 10 మంది ఉపాధ్యాయ నేతలు... వివిధ సంఘాల మద్దతుతో పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 5న నామినేషన్ల గడువు ముగియనుంది. ఈనెల 22 న ఎన్నికలు జరగనున్నాయి.
ఇవీ చూడండి:వీరుడికి ఘనస్వాగతం