రేపు తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉ.9.30 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పార్టీ శ్రేణులు నిరాడంబరంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని తెరాస అధినేత పిలుపునిచ్చారు. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తమ ప్రాంతాల్లోనే పతాకావిష్కరణ చేసి... తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించాలని సూచించారు. పార్టీ శ్రేణులు కచ్చితంగా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రధాన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని తెరాస సాధించిందని ముఖ్యమంత్రి కేసీర్ పేర్కొన్నారు. అలాగే సంక్షేమం, విద్యుత్, సాగునీటి, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు నమోదు చేసిందన్నారు. దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించిదని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నామని... ఇది పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమన్నారు.