'దేశ ప్రతిష్ఠను ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందేలా చేసిన పీవీ నరసింహారావు బిడ్డను ఆదరించాలి' అంటూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్‌లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక కార్పొరేటర్లు సి.ఎన్.రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, సంగీత యాదవ్, దేదీప్యలతో కలిసి వాణీదేవి ప్రచారం నిర్వహించారు. పాదచారులతో పాటు యోగ, ఇతర వ్యాయామాలు చేస్తున్న వారిని కలిసి ముచ్చటించారు. తాను పీవీ కుమార్తెనే కాకుండా విద్యాసంస్థలు నడుపుతూ పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తినని సురభి పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
విష ప్రచారాలకు భయపడం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని ఎమ్మెల్యే గోపీనాథ్ అన్నారు. మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించామని పేర్కొన్నారు. ఒకవైపు అభివృద్ధి.. మరొకవైపు శాంతిభద్రతలను పరిరక్షించడంలో తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సఫలీకృతం అయిందని తెలిపారు. భాజపా నాయకులు ఎంత విషప్రచారం చేసినా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బ్యాలెట్ బాక్సులు!