Trs Meeting with KCR: కేంద్రప్రభుత్వంపై పోరాటం ఉద్ధృతం చేసే దిశగా.. తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. తెలంగాణభవన్‌లో నిర్వహించిన ఈ విస్తృత స్థాయి సమావేశానికి తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, బొగ్గు గనుల ప్రైవేటీకరణ వంటి అంశాలతో పాటు కేంద్రంపై పోరాటం, రాష్ట్రంలో భాజపాపై పోరులో భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దళితబంధు సహా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రతిపక్షాల ప్రచారం, ప్రజల్లో అనుమానాలను తిప్పికొట్టేలా కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
దశలవారీగా దళితబంధు
నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ చర్చించారు. రైతుబంధు యథావిధిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. దళితబంధుపై విపక్షాల ప్రచారం తిప్పికొట్టాలన్నారు. దళితబంధు దశలవారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని.. కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించుకునే బాధ్యత తనదే అని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.
20న నియోజకవర్గాల్లో నిరసనలు
ఈనెల 20న అన్ని నియోజకవర్గాల్లో తెరాస నిరసనలు చేపట్టనుంది. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు చేయాలని సీఎం నిర్ణయించారు. నియోజకవర్గాల్లో నిరసనలు చేయాలని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. రేపు ధాన్యం కొనుగోళ్లపై దిల్లీకి మంత్రుల బృందం వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రమంత్రులను రేపు మంత్రుల బృందం కలవనుంది.
ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన ఖమ్మం జిల్లా నేతలు ఎమ్మెల్సీ క్రాస్ ఓటింగ్‌పై వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించుకోవాలని ఖమ్మం జిల్లా నేతలకు సీఎం ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లపై ఆందోళనలు
ధాన్యం కొనుగోళ్లపై మోదీ సర్కార్ తీరుకు నిరసనగా ఇప్పటికే నియోజకవర్గాల్లో ఆందోళనలు చేయడంతోపాటు ఇందిరాపార్కు వద్ద ధర్నాలో స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ తెరాస ఎంపీలు నిరసన గళం విప్పారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయిన కేసీఆర్.. కేంద్రంపై పోరాటానికి కలిసి రావాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో భాజపా తీరుపై మరింత ఉద్ధృతంగా ఉద్యమించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ శ్రేణులందరినీ భాగస్వామ్యం చేసే దిశగా.... తెరాస కసరత్తు చేస్తోంది. మరోవైపు దళితబంధు సహా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రతిపక్షాల ప్రచారం, ప్రజల్లో అనుమానాలను తిప్పికొట్టేలా కార్యకర్తలకు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
శనివారం మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఈనెల 19 నుంచి సీఎం జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం శ్రేణుల్లో స్తబ్ధత తొలగించి ఉత్సాహాన్ని నింపే ద్విముఖ వ్యూహంతో కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
Trs Meeting with KCR: తెరాస కీలక సమావేశం.. పార్టీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం