కేసీఆర్ ప్రభుత్వం కరోనా వైరస్ కేసుల వాస్తవ గణాంకాలను దాస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కరోనా కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకే.. రాష్ట్ర ప్రభుత్వం తగినంత మందిని పరీక్షించడం లేదని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. డెంగ్యూ, కొవిడ్-19 మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అర్థం చేసుకోవాలని నారాయణరెడ్డి సూచించారు.
రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం పనితీరు సరిగా లేదని విమర్శించారు. 1500 పడకల కొత్త ఆసుపత్రి కోసం నియమించిన సిబ్బంది వివరాలను కేంద్ర బృందం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. భాజపా ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయగా.. ఇక్కడ తెరాస ప్రభుత్వం తన తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత పరీక్షించని, చికిత్స చేయని కరోనా రోగులు సమాజానికి ప్రమాదకారిగా మారతారని.. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షించి తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష