ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ (TRSPP) సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, కేంద్రం వైఖరి, రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీలు... ఇతర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. వానాకాలంలో వరిసాగు విస్తీర్ణంపై పూటకో మాట మాట్లాడుతూ కేంద్రం కిరికిరి పెడుతోందని కేసీఆర్ విమర్శించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా... కేవలం 60 లక్షలే సేకరిస్తామని పాతపాటే పడుతోందన్నారు.
ఆ అంశంపై ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మోదీ సర్కారు అయోమయ, అస్పష్ట విధానాలు... దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యసేకరణకు సమగ్ర జాతీయ విధానాన్ని ఇప్పటికైనా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంట్లో కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఎంపీలను ముఖ్యమంత్రి ఆదేశించారు.
తీవ్ర అంసతృప్తి...
కేంద్ర మంత్రులు, అధికారులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా... ధాన్యం సేకరణ విషయంలో ఎటూ తేల్చక పోవడంపై... తెరాస పార్లమెంటరీ పార్టీ (TRSPP) సమావేశం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అసంబద్ధ, ద్వంద్వ వైఖరిని కేంద్రం వీడాలని డిమాండ్ చేసింది. ధాన్యం దిగుబడిలో అనతికాలంలోనే రాష్ట్ర రైతులు... దేశానికి ఆదర్శంగా నిలిచారని సమావేశం గుర్తుచేసింది. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి ఆశనిపాతంగా మారిందని... ఆందోళన వ్యక్తం చేసింది.
పోరాటం కొనసాగిస్తాం...
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలన్న సీఎం కేసీఆర్(Cm Kcr)... పంటలకు కనీస మద్ధతు ధర చట్టం, విద్యుత్తు చట్టాల రద్దు కోసం పోరాడాలని ఎంపీలకు సూచించారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం పట్టుబట్టాలని... కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి విషయమై ప్రశ్నించాలని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో... రాజీపడే ప్రసక్తే లేదన్న ఆయన... ఇందుకోసం పార్లమెంట్ లోపలా బయటా కేంద్రంపై పోరాటం కొనసాగుతుందన్నారు.
ఇదీ చదవండి:
Telangana Cabinet Meeting: రేపు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం.. ధాన్యం కొనుగోలే కీలకాంశం